న్యూఢిల్లీ: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారం నెల రోజుల కనిష్టానికి పడిపోయాయి. బంగారం ధర 0.3 శాతం తగ్గి ఔన్స్ బంగారం ధర 1,494.04 డాలర్లకు చేరుకుంది. అంతకన్నా ముందు ప్రారంభ ట్రేడింగ్‌లో ఔన్స్‌ బంగారం ధర 1,486 డాలర్లకు చేరి ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది. మంగళవారం నాడు డొమెస్టిక్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.90 మేర తగ్గి 22 క్యారట్ల బంగారం రూ.37,300 పలకగా, 24 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ. 90 మేర తగ్గి రూ. 38,300 పలికింది. దీంతో ఇటీవల కాలంలో పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో మొత్తంగా రూ.1500 తగ్గుదల నమోదు చేసుకుని నెల రోజుల కనిష్టానికి పడిపోయింది. ఇటీవల బంగారం ధరల పెంపు కారణంగా జువెలరీ డిమాండ్ తగ్గిందని.. పండగ సీజన్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటంతో ఇక జువెలరీకి మళ్లీ డిమాండ్ ఏర్పడుతుందని గోల్డ్ జువెలరీ వ్యాపారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.


ప్రస్తుతం బంగారం వ్యాపారుల దృష్టి అంతా గురువారం జరగనున్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశంపైనే ఉంది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని బంగారం వ్యాపారులు భావిస్తున్నారు. వచ్చే వారం జరగనున్న యూఎస్ ఫెడరల్ పాలసీ సమావేశంలోనూ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పరిశ్రవర్గాలు భావిస్తున్నాయి. అదే కానీ జరిగితే ధరల పరంగా అది తమకు కలిసొచ్చే అవుతుందని బంగారం వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.