న్యూఢిల్లీ: ఢిల్లీలో నేడు 31వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో జీఎస్టీ స్లాబ్‌లలో మార్పులు వుండే అవకాశం వుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్ కండిషనర్స్, పవర్ బ్యాంక్స్, కంప్యూటర్ మానిటర్స్, పాత్రలు శుభ్రం చేసే యంత్రాలు వంటి విద్యుత్ గృహోపకరణాల ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని పీటీఐ పేర్కొంది. ఇవేకాకుండా సిమెంట్ ధరలు సైతం కొంత తగ్గే అవకాశం వుందని తెలుస్తోంది. వస్తు, సేవల పన్ను పరిధిలోని 99% ఉత్పత్తులు, సేవలను 18% పన్ను లేదా తక్కువ పన్ను స్లాబ్‌లోకి తీసుకువస్తామని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జీఎస్టీలో 0%, 8%, 12%, 18%, 28% అని ఐదు రకాల స్లాబ్స్ అమలులో వున్నాయి. అందులో నిత్యవసరాలపై పన్ను లేకపోగా పలు రకాల లగ్జరీ వస్తువులు, సేవలు 28% స్లాబ్ పరిధిలో వున్నాయి.