భారత ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి నిజంగానే ధైర్యముంటే ఈ సారి ఎన్నికల్లో హైదరాబాద్ నుండి పోటీ చేయాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్హదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా సవాలు విసిరారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేసినా కూడా హైదరాబాద్ నగరం నుండి గెలవడం సాధ్యం కాదని ఆయన ఎద్దేవా చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ధైర్యముంటే ముందస్తు ఎన్నికలకు ప్రకటన ఇవ్వాలని ఈ సందర్భంగా ఒవైసీ తెలిపారు. "బీజేపీ పాలనలో ఈ నాలుగు సంవత్సరాలు జనాలకు విరక్తి తప్ప ఇంకేమీ మిగలలేదని.. వారు బీజేపీకి తగిన గుణపాఠం నేర్పడానికి రాబోయే ఎన్నికల కోసం వేచి చూస్తున్నారని" ఒవైసీ అన్నారు. గోసంరక్షణ పేరుతో 28 ముస్లిములను బీజేపీ ప్రభుత్వం హయాంలో హతమార్చడం జరిగిందని ఒవైసీ అన్నారు. 


బీజేపీ పాలనలోకి వచ్చాక మతం పేరుతో జరిగిన దాడులు 25 శాతం పెరిగాయని.. అలాంటి ఘటనలు 8890 జరిగాయని.. ఈ ఘటనల్లో 390 మంది మరణించగా.. 9000 మంది గాయపడ్డారని.. కేంద్ర హోం శాఖ ఇచ్చిన గణాంకాల ఆధారంగానే ఈ మాటలు అంటున్నానని ఒవైసీ అన్నారు. ప్రస్తుతం ఒవైసీ హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.