కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని విమర్శిస్తూనే.. ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావాలంటూ సూచించారు. తన దృష్టిలో రాహుల్ నాయకుడే కాదని అన్నారు. ఓ వ్యక్తిగా రాహుల్ అంటే తనకు ఇష్టమని... అయితే ఓ నేతగా ఆయనను తాను ఎన్నడూ చూడలేదని చెప్పారు. ఆయన చెప్పే విషయాలను పాటించడానికి... ఆయన తనకు హైకమాండ్ కాదన్నారు. రాహుల్ సోదరి ప్రియాంక వాద్రా రాజకీయాల్లోకి రావాలని అన్నారు. ప్రియాంకలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని... అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.


2019 సాధారణ ఎన్నికల్లో పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి తరపును తాను పోటీ చేయబోనని హార్దిక్ స్పష్టం చేశారు. గత ఏడాది జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కూడా హార్దిక్ పోటీ చేయలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా హార్దిక్ పోటీ చేయబోతున్నారనే వార్తలపై స్పందించిన ఆయన ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు.