న్యూఢిల్లీ: భారతీయులు ఆశించిందే జరిగింది. పాకిస్తాన్ వైపు నుంచి భారత్‌పై జరుగుతున్న ఉగ్రవాద దాడులను తిప్పికొట్టడానికి మళ్లీ ఏదో ఒకరోజు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఆకస్మిక దాడులు చేయక తప్పదని ప్రపంచం అంతా ముందుగానే ఊహించింది. సరిగ్గా సోమవారం అర్థరాత్రి దాటాక మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు భారత వైమానిక దళానికి సంబంధించిన మిరేజ్ 2000 జెట్ రకానికి చెందిన 12 యుద్ధ విమానాలు సరిహద్దు రేఖ దాటి వెళ్లి పాకిస్తాన్ భూభాగంపై వున్న ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. భారత యుద్ధ విమానాలు సరిహద్దు రేఖ దాటుతుండటాన్ని పాక్ వైమానిక దళాలు గుర్తించి నిరోధించేలోపే భారత్ యుద్ధ విమానాలు పాక్ భూభాగంపై విధ్వంసం సృష్టించివచ్చాయి.