ప్రధాని నరేంద్ర మోదీ చాలా బాగా మాట్లాడతారు. ఆ విషయాన్ని తాను కూడా అంగీకరిస్తాను. ప్రధాని నరేంద్ర మోదీ ఒక నటుడు మాదిరిగా బాగా మాట్లాడుతారు సరే కానీ మోదీ ఉపన్యాసాలు జనం ఆకలి తీరిస్తే, తాను ఇంకా సంతోషిస్తాను అని అన్నారు సోనియా గాంధీ. కాకపోతే మాటలు మాత్రమే మాట్లాడి చేతలు శూన్యమైతే, ఆ మాటలు జనం కడుపు నింపవు కదా అని ప్రధాని ఉపన్యాసాలను సోనియా గాంధీ తనదైన స్టైల్లో ఎద్దేవా చేశారు. రెండేళ్ల క్రితం వారణాసి ఎన్నికల ప్రచారం నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన సోనియా గాంధీ ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనలేదు. ఈ రెండేళ్ల కాలంలో గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ తదితర రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె ప్రచారానికి వెళ్లలేదు. తాజాగా కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో బీజాపూర్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సోనియా గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎటువంటి చేయూత అందలేదు అని ఆరోపించారామె.


దేశంలోని అన్ని రాష్ట్రాలకు అంతో ఇంతో కేంద్రం నుంచి సహాయం అందింది కానీ కన్నడ నాట రైతాంగానికి కేంద్రం నుంచి ఎటువంటి మద్ధతు లభించలేదన్న ఆమె.. ప్రధాని దృష్టిలో అందరూ సమానం అంటే ఇదేనా అని ప్రధాని నరేంద్ర మోదీకి సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. కర్ణాటక కరువుతో విలవిల్లాడుతుందన్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు సీఎం సిద్ధరామయ్య చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తద్వారా కేంద్రం కర్ణాటక రైతాంగాన్నే కాకుండా యావత్ కర్ణాటకను అవమానించింది అని అన్నారామె.