తెలంగాణలో ఎన్నికల ప్రచారం చాలా వాడీ వేడీగా జరుగుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చేయడంతో వారు విరివిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక మహాకూటమి కూడా మరో రెండు రోజులలో తమ అభ్యర్థుల తుది జాబితాని విడుదల చేసి.. వారిని కూడా ప్రచారానికి పంపనుంది. అలాగే ఇటీవలే జనసేన కూడా తమ అభ్యర్థులకు ఇండిపెండెంట్లుగా దింపే అవకాశం ఉందని ప్రకటించింది. అయితే ఈ అంశంపై కూడా ఇంకా క్లారిటీ  రావాల్సి ఉంది. అలాగే సామాజిక న్యాయం పేరుతో సీపీఎం నేతృత్వంలో బడుగు, బలహీనవర్గాల సంఘాలు బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) పేరుతో బరిలోకి దిగనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా ఒంటరి పోరుకి సిద్ధం అవుతున్నాయి. లోక్సత్తా మొదలైన పార్టీలు తమ అభ్యర్థులను దింపుతున్నాయో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. కాకపోతే.. వీరందరూ చేసుకొనే ప్రచారం ఒక ఎత్తైతే.. స్వతంత్ర అభ్యర్థులుగా కొందరు చేసుకుంటున్న  ప్రచారాలు ఇప్పటికే మొదలైపోయాయి. అయితే అలాంటి ప్రచారాల్లో కొన్ని కడుపుబ్బ నవ్విస్తున్నాయని అంటున్నారు నగర పౌరులు. 


ఎల్బీ నగర్‌కి చెందిన ఓ స్వతంత్ర అభ్యర్థి తనకు పదవి కట్టబెడితే... లీటర్ పెట్రోల్ రూ.30 రూపాయలకే అందిస్తానని చెప్పడంతో జనాలు కంగుతిన్నారు. ఇది సాధ్యమేనా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే మరో అభ్యర్థికి తెలంగాణలో కులమతాలకతీంగా పుట్టిన ప్రతీ బిడ్డకు 50 గజాల స్థలాన్ని ఉచితంగా ఇస్తానని చెప్పడంతో కూడా జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇది సాధ్యమేనా? అని ఆలోచనలో పడ్డారు. మరో అభ్యర్థి అయితే తనను గెలిపిస్తే.. సంవత్సరం పాటు  ప్రతీ రోజు రెండు పాలప్యాకెట్లు, ఒక మినరల్ వాటర్ బాటల్ ప్రతీ ఇంటికి పంపిస్తానని చెప్పడం గమనార్హం. అయితే ఇలాంటి హామీలు విని ప్రజలు ఎంతవరకు స్వతంత్ర అభ్యర్థులకు ఓటేసి గెలిపిస్తారో కాలమే నిర్ణయించాలి.