RBI On Indian Economy: కొవిడ్ నష్టాలు పూడ్చుకోవడానికి మరో దశాబ్దం- ఆర్బీఐ నివేదిక..!
RBI On Indian Economy: కొవిడ్‌తో దేశ ఆర్థికవ్యవస్థకు కోలుకోలేని నష్టం కలిగింది. రెండేళ్లుగా ఉత్పత్తి తో పాటు వినియోగరంగాలు స్తంభించిపోవడంతో ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగింది.
RBI On Indian Economy: కొవిడ్‌తో దేశ ఆర్థికవ్యవస్థకు కోలుకోలేని నష్టం కలిగింది. రెండేళ్లుగా ఉత్పత్తి తో పాటు వినియోగరంగాలు స్తంభించిపోవడంతో ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగింది. ఈ నేపథ్యంలో కొవిడ్ వల్ల జరిగిన నష్టంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ నివేదికను వెలువరించింది. ఈ నివేదికలో దిగ్భాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
కొవిడ్ వల్ల గత గడిచిన రెండు ఆర్థికసంవత్సరాలతో పాటు ఈ ఆర్థికసంవత్సరం కలిపి భారత ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ. 52 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆర్బీఐ తన నివేదికలో తెలిపింది. దీన్నిపూడ్చుకోవాలంటే మరో దశాబ్దం పడుతుందని చెప్పింది. 2020 మార్చ్ నుంచి మనదేశంలో కొవిడ్ ప్రభావం మొదలైంది. దీంతో వైరస్ నియంత్రణకు వరుస లాక్‌డౌన్ లు విధించింది ప్రభుత్వం. ఫలితంగా ఉద్యోగాలు పోయి, వ్యాపారాలు నడవక ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దాదాపు మూడు నెలల పాటు సాగిన వరుస లాక్‌డౌన్ ల ఫలితంగా ప్రజల వినియోగశక్తి గణనీయంగా తగ్గిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం తర్వాత కరోనా ప్రభావం కాస్త తగ్గింది. ఆర్థికకార్యకలాపాలు తిరిగి పుంజుకుంటున్న సమయంలో మళ్లీ 2021 జూన్ లో సెకండ్ వేవ్ జనజీవనాన్ని అల్లకల్లోలం చేసింది. రికార్డు స్థాయి మరణాలతో ఎప్పుడూ చూడని ఒక భయానక పరిస్థితి కనిపించింది. దీంతో తిరిగి లాక్‌డౌన్ విధించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మరోసారి ఆర్థికవ్యవస్థ పతనమైంది. ఆవెంటనే 2022 జనవరిలో థర్డ్‌వేవ్ కూడా ఆర్థికవ్యవస్థపై ప్రభావంచూపింది. కొవిడ్ తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న ప్రస్తుత తరుణంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం మళ్లీ కష్టాలను తెచ్చింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు, నిత్యావసరాల ధరలు మరోసారి దేశ గ్రోత్‌రేట్ పై పెను ప్రభావంచూపుతున్నాయి.
వరుస విలయాల ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ చూడని పతనాన్ని చవిచూసింది. 2020-21 ఆర్థికసంవత్సరంలో గ్రోత్ రేట్ మైనస్ 6.6 శాతానికి దిగజారింది. 2021-22 ఆర్థికసంవత్సరంలో గ్రోత్ రేట్ 8.9 శాతం నమోదుకాగా.. ఈ ఆర్థిక సంవత్సరం 7.2 శాతం వృద్ధిరేటు ఉంటుందని ఆర్బీఐ లెక్కకట్టింది. మొత్తంగా కొవిడ్ నష్టాలను పూడ్చుకోవడానికి మనదేశానికి 2034-35 వరకు సమయం పడుతుందని ఆర్బీఐ నివేదికలో తెలిపింది.
ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంత నష్టం జరిగిందన్న విషయాలను కూడా ఆర్బీఐ నివేదికలో వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 19.1 లక్షల కోట్లు,, 2021-22 ఆర్థికసంవత్సరంలో రూ.17.1 లక్షల కోట్లు దేశ ఆర్థికవ్యవస్థ నష్టపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ. 16.4 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనావేసింది. ఇదంతా కలిపితే రూ. 52 లక్షల కోట్లను మన దేశం నష్టపోయింది. కొవిడ్‌కు ముందు స్థిరంగా వృద్ధి సాధించిన మనదేశానికి ఇది పూడ్చుకోలేని నష్టం. మరో దశాబ్దం గడిస్తే కానీ ఈ నష్టం భర్తీ కాదని ఆర్బీఐ తెలిపింది.
Also Read: Jupalli Krishna Rao: టీఆర్ఎస్ లోనే ఉన్నా... కాని..! పార్టీ మార్పుపై మాజీ మంత్రి జూపల్లి క్లారిటీ..
Also Read: Bandi Sanjay: తెలంగాణలో మళ్లీ వరి రగడ..సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.