విమానయాన సం‌స్థ ఇండిగో మంగళవారం దేశీయంగా తిరగాల్సిన 47 విమానాలను రద్దు చేసింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ప్రాట్‌ అండ్‌ విట్నీఇంజిన్ల వైఫల్యాల కారణంగా ఎ320 నియో(న్యూ ఇంజిన్‌ ఆప్షన్‌) విమానాలను నిలిపివేస్తోంది. ఇప్పటికే ఇండిగోకు చెందిన 8 విమానాలను, గోఎయిర్‌కు చెందిన 3 విమానాలను డీజీసీఏ తప్పించింది. విమానాల రద్దు ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇండిగో మార్చి 13న  47 విమానాలను రద్దు చేసింది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పట్నా, శ్రీనగర్‌, భువనేశ్వర్‌, అమృత్‌సర్‌, గౌహతి తదితర నగరాల నుంచి వెళ్లాల్సిన కొన్ని విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది.


సోమవారం అహ్మదాబాద్‌ నుంచి లక్నో మీదుగా కోల్‌కతా వెళ్తున్న ఇండిగోకు చెందిన ఎయిర్‌ బస్‌ ఏ320 నియో విమానం ఎగిరిన కొన్ని నిమిషాలకే దాంట్లోని పిడబ్ల్యూ 1100 ఇంజన్‌ మొరాయించింది. దీంతో 186 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానాన్ని వెంటనే ఢిల్లీలో ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే డీజీసీఏ ప్రాట్‌ అండ్‌ విట్నీ ఇంజిన్ల వైఫల్యాలున్న ఎ320 నియో విమానాలు నిలిపివేత ప్రారంభించింది. విమానాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది.  దేశీయ విమానయాన రంగంలో ఇండిగోకు 40శాతం, గోఎయిర్‌కు 10శాతం మార్కెట్‌ షేర్ ఉంది