చిదంబరానికి మరో షాక్ ; జ్యూడిషియల్ కష్టడీ పొడగింపు
మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం అక్టోబర్ 3 వరకు తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది
ఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియాలో కేసులో కాంగ్రెస్ సీనియన్ నేత చిదంబరానికి మరో షాక్ తగిలింది. జ్యుడీషియల్ కస్టడీని వచ్చే నెల 3 వరకూ న్యాయస్థానం పొడిగించింది. తాజాగా ఆయన కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు చిదంబరాన్ని తీహార్ జైలు నుంచి ఈ రోజు ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు తీసుకురాగా కస్టడీని మరో 14 రోజుల పాటు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ కోసం ఆయన విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ న్యాయస్థానం ఆయన అభ్యర్ధనను తిరస్కరించింది. కోర్జు తాజా ఆదేశాలతో చిదంబరం అక్టోబర్ 3 వరకు తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ.305 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అయితే వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు గుర్తించిన సీబీఐ పలు సెక్షన్ల కింద చిదంబరంపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో గత నెలలో ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా తొలుత సీబీఐ కస్టడీకి అప్పగించిన న్యాయస్థానం.. ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించింది. చిదంబరానికి ఈ నెల19 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ రోజుతో ఆ గడువు ముగిసిపోవడంతో సీబీఐ అధికారులు ఆయన్ను కోర్టులో హాజరుపర్చగా... అక్టోబర్ 3 వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీని పొడగిస్తూ న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.