ఢిల్లీ: రైలు ప్రయాణికులకు ఐఆర్‌సిటిసి ఓ శుభవార్త వెల్లడించింది. రిజ‌ర్వేష‌న్ చార్టు త‌యారయ్యే వ‌ర‌కు ప్రయాణికులు ఎప్పుడైనా తమ బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు ఐఆర్‌సిటిసి ప్ర‌క‌టించింది. ఇప్ప‌టివ‌ర‌కు అమలులో వున్న నిబంధనల ప్రకారం ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఎంచుకున్న బోర్డింగ్ పాయింట్ కాకుండా మరో రైల్వే స్టేష‌న్‌లో రైలు ఎక్కాల్సి వస్తే, రైలు ప్రయాణానికి 24 గంట‌ల ముందు మాత్రమే మార్చుకోవాల్సి వ‌చ్చేది. 


అయితే, తాజాగా ఐఆర్‌సిటీసి తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం ఇకపై చార్ట్ ప్రిపేర్ అయ్యే వ‌ర‌కు ప్రయాణికులు ఎప్పుడంటే అప్పుడు తమ బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకునేందుకు వీలుంది. తరచుగా ప్రయాణాలు చేసేవారికి ఇది కలిసొచ్చే అంశమే అవుతుందని ఐఆర్‌సిటిసి పేర్కొంది. ప్రయాణం ప్రారంభించే రైల్వే స్టేషన్ నుంచి గమ్యస్థానం వరకు రైలు ఆగే స్టేషన్స్‌లో ఏ స్టేషన్‌లోనైనా రైలు ఎక్కేవిధంగా బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చుననే సంగతి తెలిసిందే.