కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఇప్పట్లో లేనట్లేనా..!
దేశంలోని బీజేపీ, కాంగ్రెస్‌యేతర పార్టీలను కలుపుకొని ఫెడరల్ ఫ్రంట్ పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ మధ్య జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు.
దేశంలోని బీజేపీ, కాంగ్రెస్‌యేతర పార్టీలను కలుపుకొని ఫెడరల్ ఫ్రంట్ పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ మధ్య జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. కానీ టీడీపీ తెచ్చిన అవిశ్వాసంతో పాల్గొనకుండా టీఆర్‌ఎస్ పార్టీ తీసుకున్న అడుగులు చూస్తుంటే మాత్రం ఫెడరల్ ఫ్రంట్ 2019 ఎన్నికలకు ముందు కదిలేలా లేదనిపిస్తోంది. మమతా బెనర్జీ ఓ అడుగు ముందుకేసి బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా గళం విప్పినా, కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడం గమనార్హం.
శుక్రవారం ఎన్డీయే ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఈ విషయం బోధపడింది. బీజేపీయేతర పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవటం, ఫ్రంట్ ఏర్పాటుకు ముందుండి నడిపించే నాయకుడు ఎవరు అనేదానిపై స్పష్టత లేకపోవడం వంటి కారణాల వల్ల ఫెడరల్ ఫ్రంట్ ఇప్పట్లో లేనట్లే.. అనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రాంతీయ పార్టీల మధ్య సఖ్యతలేదనే విషయం ఓటింగ్ సంఖ్యలను బట్టి చూస్తుంటే తెలుస్తోంది.
లోక్‌సభలో వివిధ పార్టీల బలాల ఆధారంగా, అనుకూలంగా 316, వ్యతిరేకంగా 146 ఓట్లు పోలైతాయని బీజేపీ భావించింది. కానీ 325 ఓట్లు బీజేపీ పార్టీకి అనుకూలంగా,126 ఓట్లు వ్యతిరేకంగా పోలయ్యాయి. ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. టీఆర్ఎస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ఎఐఎడిఎంకె బీజేపీకి అనుకూలంగా ఓటు వేయగా, బీజేడీ సభ నుండి వాకౌట్ చేసింది. దీంతో ప్రతిపక్ష పార్టీల్లో ఐక్యత లేదని స్పష్టమైంది.
తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పడాలని గతకొంతకాలంగా సిగ్నల్స్ ఇస్తూవచ్చారు. దీనికి కేసీఆర్ కూడా మద్దతు ప్రకటించారు. కోల్కతాకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన బెంగళూరు వెళ్లి హెచ్‌డీ దేవెగౌడ, కుమారస్వామిని, చెన్నై వెళ్లి డీఎంకె నాయకుడు స్టాలిన్‌ను కూడా కలిశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కూడా కలిసి మద్దతు కూడగట్టాలని ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కేసీఆర్‌ను ప్రగతిభవన్‌కు వెళ్లి కలుసుకున్నారు. వీరిద్దరి మధ్య ఫెడరల్ ఫ్రంట్ చర్చకు వచ్చింది. ఫ్రంట్‌ను ముందుండి ఎవరు నడిపించాలనే విషయంలో ఏకాభిప్రాయం లేనందున ఎన్నికల ముందు ఫ్రంట్ సాధ్యం కాదన్నారని సమాచారం. ఎన్నికల తరువాతనే ఫ్రంట్ సాధ్యమవుతుందని చెప్పారట. 'కర్ణాటక మోడల్' తరహాలో, దేశంలో బీజేపీకి, కాంగ్రెస్‌కు మెజార్టీ రాకపోతే.. ప్రాంతీయ పార్టీలు కలిసి ఒకేతాటిపైకి వచ్చి .. అప్పటి పరిస్థితులను బట్టి ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని అన్నారట. శుక్రవారం నాటి ఓటింగ్‌లో కూడా ఇదే కనిపించింది.