ఎన్నో సమావేశాలు, చర్చల అనంతరం కర్ణాటక కేబినెట్ విస్తరణలో కాంగ్రెస్-జనతా దళ్ సెక్యులర్ (జేడీఎస్) కూటమి ఓ ఏకాభిప్రాయానికి వచ్చింది. కూటమి తీసుకున్న అంతిమ నిర్ణయం ప్రకారం జేడీఎస్‌కి ఆర్థిక శాఖ దక్కనుండగా కాంగ్రెస్ పార్టీ నేతకు హోం మంత్రిత్వ శాఖ కేటాయించనున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. దీంతో ఇన్నిరోజులుగా ఈ రెండు కీలక శాఖల కేటాయింపుపై వున్న స్తబ్ధత తొలగిపోయింది. ఫలితంగా కేబినెట్ కూర్పుకు మార్గం సుగుమమైంది. జూన్ 6వ తేదీన కేబినెట్ ఏర్పాటు చేయనున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టంచేశారు. మే 23వ తేదీన ముఖ్యమంత్రిగా కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత డా.జి. పరమేశ్వర ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఇప్పటివరకు కేబినెట్ ఏర్పాటు కాలేదు. 


ఇదిలావుంటే, ఇవాళ శుక్రవారం ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వరతో కలిసి వెళ్లి రాజ్ భవన్‌లో గవర్నర్ వాజుభాయ్ వాలాతో సమావేశమైన ముఖ్యమంత్రి కుమారస్వామి.. కేబినెట్ సభ్యుల ప్రమాణస్వీకారం తేదీ, తదితర అంశాలపై గవర్నర్‌కు సమాచారం అందించారు. అంతకన్నా ముందుగా కుమారస్వామి, జి పరమేశ్వర, కేసీ వేణుగోపాల్, మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డి దేవేగౌడతో భేటీ అయి కేబినెట్ ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశంలోనే కేబినెట్‌లో కీలక శాఖల కేటాయింపుపై అంతిమ నిర్ణయం తీసుకున్నారు.