బీజేపీ నేత సదానంద గౌడ ఈ రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని.. అది ఆ పార్టీ అంతర్గత విషయమని.. ఆఖరికి వారు పాకిస్తానుకి తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదని సదానంద గౌడ అన్నారు. "బీజేపీకి మెజారిటీ ఉన్నందు వల్లే ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఇక కాంగ్రెస్ ఏం చేస్తుందనేది వాళ్లిష్టం. వారు తమ ఎమ్మెల్యేలను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు" అని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక సుప్రీంకోర్టులో బీజేపీ తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి, జేడీఎస్‌కు మధ్య ఎలాంటి పొత్తు లేదని.. కాబట్టి ఆ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పవచ్చని ఆయన తెలిపారు. అలాగే గవర్నరుకి ఎడ్యూరప్ప ఇచ్చిన లేఖను కూడా ఆయన కోర్టులో అందించారు. 



ఆ ఉత్తరంలో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి అధినేతగా ఎడ్యూరప్ప నియమించబడ్డారని.. అందుకు తగ్గ ఎమ్మె్ల్యేల మద్దతు ఆయనకు ఉందని పేర్కొన్నారు. ఆ మద్దతుతో ఫ్లోరులో మెజారిటీ నిరూపించుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అలాగే కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య పొత్తు అనే అంశం సక్రమమైన రీతిలో లేదని ముకుల్ ఆరోపించారు. ఎడ్యూరప్ప గవర్నరుకి నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేల పేర్లు అన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఫ్లోరులో మెజారిటీ నిరూపించుకొనేందుకు సిద్ధంగా ఆయన ఉన్నప్పుడు పేర్లు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.