త్రిపురలో ఈ రోజు పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవలే ఈ రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన మిత్ర పక్షంతో కలిసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత 25 ఏళ్ళుగా అధికారంలో ఉన్న లెఫ్ట్ పార్టీ తొలిసారిగా ఓటమి పాలై.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసింది. అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడైన రెండు రోజుల్లోనే త్రిపురలోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీ మద్దతుదారులు, లెఫ్ట్ మద్దతుదారులు వర్గాలుగా వీడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో కొందరు దుండగులు బీజేపీ పేరు చెబుతూ అరాచకాలకు పాల్పడ్డారు. త్రిపురలోని ప్రముఖ కమ్యూనిస్టు నేత లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. లెనిన్ విగ్రహం కూలిపోయాక సీపీఎం నేతలు స్పందించారు. ఇలాంటి ఘటనల ద్వారా బీజేపీ ఎలాంటి సంకేతాలు పంపిస్తుందో తెలుసుకోవాలని.. రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం భయాందోళనలతో ఉన్నారని తెలిపారు.


అయితే లెనిన్ విగ్రహం కూల్చివేత ఘటన జరిగాక.. కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ స్పందించారు. తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీస్ శాఖను ఆదేశించారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయడం పట్ల త్రిపుర గవర్నరు తథాగత రాయ్ స్పందించారు.


తనకు హోంశాఖ నుండి ఎలాంటి సమాచారం రాలేదని.. మీడియా తప్పుడు వార్తలను దయచేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని తెలిపారు. త్రిపురలోని బెలోనియా కాలేజ్ స్వేర్‌లో ఉన్న భారీ లెనిన్ విగ్రహాన్ని కూల్చివేయడం పై స్పందిస్తూ.. ప్రస్తుతం పలు ప్రజా సంఘాలు త్రిపురలో ర్యాలీలు, ధర్నాలు చేయడానికి సంసిద్ధమయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు