భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేత లాల్ క్రిష్ణ అద్వానీ శుక్రవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై ప్రశంసల వర్షం కురిపించారు. నాగపూర్‌లో జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సమావేశానికి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరై తన ప్రసంగాన్ని అందించినందుకు అద్వానీ.. ప్రణబ్‌ను కొనియాడారు. ముఖ్యంగా ఆర్‌ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ ఆహ్వానాన్ని మన్నించి ప్రణబ్ కార్యక్రమానికి హాజరు అయినందుకు ఆయనను ప్రశంసించిన అద్వానీ.. ఆ ఘటనను ఒక చారిత్రాత్మక ఘటనగా అభిప్రాయపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐడియాలజీ పరంగా ఇరు పార్టీ వ్యక్తుల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ.. ఒకే వేదికను పంచుకున్నందుకు వారి చొరవను స్వాగతిస్తున్నానని అద్వానీ అన్నారు. "మోహన్ భగవత్, ప్రణబ్ ముఖర్జీ.. ఇద్దరూ కూడా భారతదేశ ఐక్యత ఆవశ్యకత గురించి, భిన్నత్వాలను గౌరవించి, నమ్మకాలను స్వాగతించే దిశగా"  మాట్లాడారని అద్వానీ అన్నారు. 


"ఇలాంటి సమావేశాలు ఒక గౌరవానికి నాంది పలుకుతాయి. జనుల మధ్య ఓర్పు, సహనం, సహృద్భావం పెరగడానికి తోడ్పడతాయి" అని అద్వానీ అన్నారు. "అందరినీ ఆదరించే గుణమే ప్రణబ్‌ను గొప్ప నేతగా తీర్చిదిద్దాయని.. ఆయన అనుభవం చాలా గొప్పదని.. ఇలాంటి సమావేశాల అవసరం గురించి ఆయన ఆలోచించడం.. వాటికి హాజరుకావడం వల్ల పెంపొందే సహృద్భావం గురించి ప్రణబ్ ఆలోచించడం ఒక సందేశాన్ని, సంకేతాన్ని దేశానికి పంపుతుంది" అని అద్వానీ తెలిపారు.