బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ "పద్మావతి" చిత్రానికి మద్దతు తెలిపారు. ఈ సినిమా గురించి ఇప్పటికే అనుకున్నదాని కంటే చాలా మంది తమ ఆలోచనలు పంచుకున్నారని.. ఇక పార్లమెంటు ప్యానెల్ అనేది ఒకటి ఏర్పడి చర్చించడం సముచితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్రబిందువుగా మారిన "పద్మావతి" చిత్రం మీద చర్చించేందుకు ఏర్పడిన పార్లమెంట్ ప్యానెల్‌కు సంజయ్ లీలా భన్సాలీ హాజరయ్యారు. అయితే ప్యానెల్ ఛైర్మన్ అనురాగ్ ఠాగూర్, భన్సాలీపై కోపాన్ని వ్యక్తం చేశారు.


సినిమా సెన్సార్‌కు వెళ్లకముందే మీడియా ప్రతినిధులకు చూపించడం వెనుక దర్శకుడి అభిమతం ఏమిటని ఆయన విమర్శించారు. అయితే తనవైపు తప్పు లేదని తెలపడానికే.. తాను మీడియాకి స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశానని భన్సాలీ తెలిపారు. కాకపోతే ప్యానెల్ భన్సాలీ ఆలోచనలను తప్పు పట్టింది. భావోద్వేగాలతో ఆడుకుంటూ.. సినిమా ద్వారా దర్శకుడు లాభాలు ఆర్జించాలని అనుకుంటున్నారని మండిపడింది. సినిమాను కల్పిత కథా నేపథ్యంలో తెరకెక్కించామని చెబుతున్నప్పుడు, అసలైన పాత్రల పేర్లు వాడాల్సిన అవసరం లేదని ప్యానెల్ పేర్కొంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రెండవ ట్రైలర్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు. ఆ ట్రైలర్‌లో రాజ్‌పుత్ వీరుల సత్తాను ప్రపంచానికి చాటే సంభాషణలు, సన్నివేశాలు ఉండనున్నట్లు సమాచారం.