ఆలస్యంగా వెలువడనున్న ఎన్నికల ఫలితాలు
ఎన్నికల ఫలితాల వెల్లడికి ఆలస్యం తప్పదా ?
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ఫలితాల వెల్లడిలో భాగంగా నేడు ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్నప్పటికీ.. ఈవిఎంలలో ఓట్ల కౌంట్‌తోపాటు వీవీప్యాట్‌లలో ఓట్ల లెక్కింపు ట్యాలీ కావాల్సి ఉండటంతో ఫలితాల వెల్లడి ఇవాళ సాయంత్రం పొద్దుపోయాకే వెలువడే అవకాశాలున్నాయని ఎన్నికల పరిశీలకులు చెబుతున్నారు. దాదాపు అత్యధిక శాతం లోక్ సభ స్థానాల్లో ఫలితాలు ఇవాళ సాయంత్రానికే ఓ కొలిక్కి వచ్చే అవకాశం వున్నప్పటికీ.. ఇంకొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఫలితాల వెల్లడికి రేపు ఉదయం వరకు సమయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉండగా ఓట్ల కౌంటింగ్ అనంతరం ఫలితాల రూపంలో ఆ ప్రజా తీర్పు అందరి ముందుకు రానుంది.
భారత దేశ లోక్ సభ ఎన్నికల చరిత్రలో ఇదే తొలిసారి:
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే నేడు ఉదయం 8 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనుంది. 542 లోక్ సభ స్థానాలకు కలిపి మొత్తం 7500పైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. 90.99 కోట్ల మంది ఓటర్లలో 67.11 శాతం మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత దేశ లోక్ సభ ఎన్నికల చరిత్రలో అత్యధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం.