ప్రధాన మంత్రి మోదీ ప్రవేశపెట్టిన 'మేకిన్ ఇండియా' పథకం జీవచ్ఛవంలా మారింది. గుజరాత్ లో టాటా కంపెనీ ప్రవేశపెట్టిన 'నానో' కార్ల ప్రాజెక్టు కోసం మోదీ ప్రభుత్వం ఇచ్చిన 33వేల కోట్ల రాయితీ బాడిదలో పోసిన పన్నీరులా వృథా అయిపోయిందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.


గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని సనంద్ లో టాటా కంపెనీకి నానోకార్ల ప్రాజెక్టు కోసం మోదీ ప్రభుత్వం దాదాపు 33వేల కోట్ల రూపాయ మేరకు పన్ను రాయితీ ఇచ్చింది. ఇది యుపిఏ హయాంలోని మహాత్మా గాంధీ నేషనల్ రురల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ (ఎంజీ ఎన్ఆర్ఈజీఏ) పథకానికి సమానం. ఇంత పెద్ద మొత్తంలో రాయితీ పొందిన ఆ కంపెనీల వల్ల ఏమైనా ప్రయోజనము ఉందా?స్థానికులకు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా?.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. టాటా నానోకార్లకు వినియోగదారుల నుంచి స్పందన కరువైన నేపథ్యంలో టాటా ఆ మోడల్ ను ఎత్తివేయటానికి సిద్దమైన విషయం  తెలిసిందే. దీనిని ఆసరాగా తీసుకొని రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. నేను చెప్పినట్టుగానే "ఇదొక సూటు బూటు సర్కార్" అని,  సామాన్య ప్రజానీకానికి ఈ ప్రభుత్వంతో ఒరిగేదేమీ లేదని విమర్శించారు.