‘#మీటూ’లో భాగంగా తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేస్తూ కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ జర్నలిస్టు ప్రియా రమణిపై చట్టపరమైన చర్యలకు దిగారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పిన ఆయన సోమవారం ఆమె తప్పుడు ఆరోపణలు చేశారంటూ క్రిమినల్‌ డిఫమేషన్‌ నమోదు చేశారు. మంత్రి తరఫున లాయర్ కరంజవాలా ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టులో ఈ కేసు వేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం నైజీరియా పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న ఎంజే అక్బర్ తనపై వచ్చిన ఆరోపణలపై ఎయిర్ పోర్టులో స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలపై ప్రస్తుతం స్పందించలేనని చెప్పిన ఆయన.. తనపై మహిళా పాత్రికేయులు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను కొట్టిపారేశారు. తనపై చేస్తున్న ఆరోపణలపై సాక్ష్యాధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. విదేశాంగ మంత్రి సుష్మాను కలిసిన అనంతరం.. ఎంజే అక్బర్ తన లాయర్ ద్వారా ఇవాళ జర్నలిస్టు ప్రియా రమణిపై పరువునష్టం కేసు వేశారు.


మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజే అక్బర్‌ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


కాగా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్న ఎంజే అక్బర్‌.. ది టెలిగ్రాఫ్‌, ఆసియన్‌ ఏజ్‌, ది సండే గార్డియన్‌ వంటి ప్రముఖ పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు. ఎంజే అక్బర్ ఎడిటర్‌గా ఉన్నప్పుడు తమను వేధించాడంటూ మహిళా జర్నలిస్టులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఎంజే అక్బర్ తనను వేధించారంటూ తొలిసారి ప్రియా రమణి అనే జర్నలిస్ట్ బయటపెట్టగా... ఆ తర్వాత ప్రేరణ సింగ్ బింద్రా, మరికొంతమంది మహిళా జర్నలిస్టులు కూడా అక్బర్‌పై ఇలాంటి ఆరోపణలే గుప్పించారు.