మోడీ నా కన్న బెస్ట్ స్పీకర్
ప్రసంగాలు చేయడంలో నరేంద్ర మోడీ దిట్ట అని.. ఆయనలా ప్రసంగించడం తన వల్ల కాదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే తాను ఆయనలా గొప్పగా ప్రసంగించలేకపోయినా... ప్రజల సమస్యలను సావధానంగా విని వాటిని పరిష్కరించే ఓపిక తనకు ఉందని ఆయన అన్నారు. ఆ విషయంలో అయితే ప్రధాని ఇంకా వెనుకబడి ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. మోడీ మాట్లాడే వ్యక్తే గానీ... ప్రజల సమస్యలను వినే వ్యక్తి కాదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నేడు బీజేపీ పరిస్థితి చూస్తుంటే.. వారి మాటలు కేవలం లౌడ్ స్పీకర్ల మాదిరిగానే ఉన్నాయని.. ఆ మాటలు చేతలుగా మారడం లేదని రాహుల్ అభిప్రాయపడ్డారు. సూరత్ పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సూరత్ ప్రాంతంలో ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ "బ్లాక్ డే"ను నిర్వహించారు. మోడీలా తాను ప్రసంగించాలంటే చాలా సంవత్సరాలు పడుతుందని.. అయితే తన ఆలోచనలో పరిణితి ఉందని తెలిపారు. ఒకప్పుడు బలహీనులను ప్రభుత్వం ఆదుకోవాలని భావించిన తను, నేడు బలహీనులను బలవంతులను చేసే వ్యవస్థను బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.