1004 విమానాల రాకపోకలతో రికార్డ్ సృష్టించిన ఎయిర్ పోర్ట్
1004 విమానాల రాకపోకలతో రికార్డ్ సృష్టించిన ఎయిర్ పోర్ట్
ముంబై: ఒకే రోజు మొత్తం 1004 విమానాల రాకపోకలకు సౌకర్యం కల్పించడం ద్వారా ముంబై ఎయిర్ పోర్ట్ ఓ సరికొత్త రికార్డ్ సృష్టించింది. డిసెంబర్ 8వ తేదీన ఈ రికార్డును నెలకొల్పినట్టు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఎఎల్) వర్గాలు ఏఎన్ఐకి తెలిపాయి. గతంలో ముంబై ఎయిర్ పోర్ట్ కేంద్రంగా 1003 విమానాలు రాకపోకలు సాగించిన రికార్డు ఉండగా తాజాగా ఆ రికార్డును మరోసారి ముంబై ఎయిర్ పోర్ట్ అధిగమించిందని ఎంఐఎఎల్ స్పష్టంచేసింది. ప్రపంచంలోనే నిత్యం అత్యధిక సంఖ్యలో విమానాల రాకపోకలు సాగించే విమానాశ్రయాల్లో ఒకటిగా ముంబై ఎయిర్ పోర్టుకి పేరుంది.
ఈ ఏడాది జూన్ 5వ తేదీ వరకు ముంబై ఎయిర్ పోర్టు నుంచి ఒకే రోజు రాకపోకలు సాగించిన అత్యధిక విమానాల సంఖ్య 988 గా వుండేది. అయితే, జూన్ 5వ తేదీన మొదటిసారి ఒకే రోజు 1003 విమానాల రాకపోకలకు కేంద్రంగా నిలిచి ముంబై విమానాశ్రయం ఓ రికార్డు సొంతం చేసుకుంది. ఆ తర్వాత తాజాగా ఇలా 1004 విమానాల రాకపోకలకు కేంద్రంగా నిలిచిన ముంబై ఎయిర్ పోర్టు.. ఇప్పటివరకు తమ పేరిట వున్న సొంత రికార్డును తనే అధిగమించింది.