తెలియని వారికి లిఫ్ట్ ఇస్తే జరిమానా
అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ ఇస్తే జరిమానా కట్టాల్సిందేనని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.
అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ ఇస్తే జరిమానా కట్టాల్సిందేనని మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. సెక్షన్ 66/192 ప్రకారం తెలియని వారికి లిఫ్ట్ ఇవ్వడం నేరమని అన్నారు.
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 18న ముంబాయిలో నితిన్ నాయర్ అనే ఓ కారు యజమాని ముగ్గురు అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ ఇచ్చాడు. వర్షానికి తోడు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వృద్ధుడిని తన కారులో ఎక్కించుకున్నాడు. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్.. నితిన్ వద్దకు వచ్చి చలాన్ రాసి.. ఫైన్ కట్టాలన్నాడు. డ్రైవింగ్ లైసన్స్ తీసుకుని మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి తీసుకోవాలని చెప్పగా.. తీరా నితిన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తే కోర్టుకు వెళ్లమన్నారు. కోర్టులో న్యాయమూర్తి ముందు తప్పు చేసినవాడిలా నిలబడి.. ఇక చేసేదేమిలేక అతను ఫైన్ కట్టి లైసెన్స్‌ను వెనక్కు తీసుకోవలసి వచ్చింది. తనకు ఎదురైన అనుభవాన్ని నితిన్ తన ఫేస్‌బుక్‌లో తెలిపాడు. కాగా పోలీసుల తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు.