ఒకే భాష మాట్లాడే తెలుగు రాష్ట్రాలను.. శత్రువులుగా మార్చింది కాంగ్రెస్ నాయకులే - నరేంద్ర మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు నమో యాప్ ద్వారా పార్టీ వర్కర్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను పంచుకున్నారు. సమాజాన్ని వివిధ గ్రూపులుగా విభజించడం అనేది కాంగ్రెస్ సంప్రదాయం అని.. కానీ బీజేపీకి ఆనందాన్ని పంచడమే వచ్చని ఆయన తెలిపారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు నమో యాప్ ద్వారా పార్టీ వర్కర్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను పంచుకున్నారు. సమాజాన్ని వివిధ గ్రూపులుగా విభజించడం అనేది కాంగ్రెస్ సంప్రదాయం అని.. కానీ బీజేపీకి ఆనందాన్ని పంచడమే వచ్చని ఆయన తెలిపారు. ప్రసుత్తం అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్.. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని.. కానీ ప్రజలు సరైన సమాధానం చెబుతారని ఆయన అన్నారు. ఆంధ్రా, తెలంగాణ విషయంలో కూడా కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించిందని..ఒకే భాష మాట్లాడే తెలుగు రాష్ట్రాలను శత్రువులుగా మార్చింది కాంగ్రెస్ నాయకులే అని మోదీ ధ్వజమెత్తారు.
ఇప్పుడు మహాకూటమి పేరుతో వస్తున్న సరికొత్త విధానాలు కూడా అపజయాన్ని మూటగట్టుకోవడానికి తప్పితే.. వాటి వల్ల ఉపయోగమేమీ లేదని మోదీ అన్నారు. ప్రతిపక్షాలు అవకాశవాదులుగా వ్యవహరిస్తున్నంత కాలం ఈ పరిస్థితి మారదని అన్నారు. శత్రువులుగా ఒకరినొకరు తిట్టుకొనే పార్టీలన్నీ కూడా బీజేపీ విషయంలో మాత్రం కలిసిపోతాయని.. ప్రభుత్వాన్ని కలిసి ఏర్పాటు చేయడానికి సిద్ధమైపోతాయని మోదీ తెలిపారు.
కర్ణాటక ఎన్నికల సమయంలో కూడా బీజేపీ మీద కోపంతోనే జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేశాయని మోదీ తెలియజేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదని.. పార్టీ వర్కర్లు ప్రతిపక్షాల మోసాలను జనాలకు అర్థమయ్యేలా చెప్పడంలో ప్రధాన పాత్ర పోషించాలని మోదీ హితవు పలికారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మిజోరం, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధమవుతున్న క్రమంలో మోదీ వ్యాఖ్యలు ఇతర పార్టీ శ్రేణులను కంగుతినిపించేలా ఉన్నాయని పలువురు బీజేపీ నాయకులు అభిప్రాయపడ్డారు.