న్యూఢిల్లీ : నిర్భయ కేసు దోషులు వినయ్ కుమార్ శర్మ, ముఖేష్‌లు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కొట్టి వేసింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని అరుణ్ మిశ్రా, ఆర్.ఎఫ్ నారిమన్, ఆర్ భానుమతి, అశోక్ భూషణ్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసం.. నిర్భయ దోషులు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను మంగళవారం (జనవరి 14న) విచారించిన అనంతరం వాటిని కొట్టివేస్తున్నట్టు స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీచేసిన ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు.. జనవరి 22న ఉదయం 7 గంటలకు వారికి ఉరిశిక్ష అమలు చేయాల్సిందిగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ రెండు వారాల్లోనే దోషులు క్యూరేటివ్ పిటిషన్, మెర్సి పిటిషన్ వంటి అవకాశాలను ఉపయోగించుకోవచ్చు అంటూ కోర్టు స్పష్టంచేసింది. పటియాలా హౌజ్ కోర్టు ఇచ్చిన అవకాశం మేరకే ఇద్దరు దోషులు వినయ్ కుమార్ శర్మ, ముఖేష్‌ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ... సుప్రీం కోర్టు ధర్మాసనం వారి పిటిషన్లను అనర్హమైనవిగా భావిస్తూ కొట్టివేయడమైంది. ఇక మిగిలిందల్లా రాష్ట్రపతి ఎదుట క్షమాభిక్ష పిటిషన్ (మెర్సి పిటిషన్) దాఖలు చేయడమే. మరి దోషులు మెర్సి పిటిషన్ కూడా ఉపయోగించుకుంటారా లేదా అనేది వేచిచూడాల్సి ఉంది. 


ఇదిలావుంటే, మరోవైపు ఢిల్లీలోని తీహార్ జైల్లో దోషులకు ఉరి శిక్ష అమలు చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఒకవేళ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరి.. ఆ క్షమాభిక్ష పిటిషన్ కూడా తిరస్కరణకు గురైనట్టయితే.. ఆ నలుగురు దోషులను ఉరి తీసేందుకు పవన్ జల్లాద్ అనే తలారి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆ నలుగురిని ఉరి తీయాల్సి వస్తే.. అందుకుగాను ఒక్కొక్కరికి రూ.25 వేలు చొప్పున మొత్తం లక్ష రూపాయలు పారితోషికం పవన్ అందుకోనున్నట్టు ఇటీవలే మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..