తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుకు బీహార్ సీఎం నితీష్‌ కుమార్‌ ఫోన్‌ చేశారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ నితీష్‌కు హామీ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆగస్టు 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో మద్దతు కూడగట్టుకునే పనిలో పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. రాజ్యసభలో ఏ పార్టీకి, ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ లేదు. ప్రధాన పక్షమైన బీజేపీ ఈ పదవిని తమ మిత్రపక్షమైన జేడీ(యూ)కి ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో జేడీయూ తమ రాజ్యసభ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్‌ను పోటీకి దింపింది. ఈ క్రమంలోనే కేసీఆర్‌కు నితీష్ ఫోన్ చేశారు. సీనియర్ జర్నలిస్టు అయిన నారాయణ్‌ సింగ్ 2014లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు.


రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా కురియన్ పదవీకాలం ముగియడంతో... జూలై 1 నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. కాంగ్రెస్, టీఎంసీలు కూడా ఈ పదవిని కోరుకుంటున్నాయి. కాగా రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. 244 మంది సభ్యులున్న రాజ్యసభలో 123 మంది సభ్యుల మద్దతు ఉంటేనే డిప్యూటీ చైర్మన్ పదవి వరించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, డీఎంకేకు చెందిన తిరుచ్చి శివ, ఎన్సీపీ నేత వందన చవాన్, నామినేటెడ్‌ సభ్యుడు కేసీ తుల్సీ ప్రతిపక్షాల అభ్యర్థిగా ముందువరుసలో ఉన్నారు. మిత్రపక్షాల్లో ఎవరిని పోటీకి నిలబెట్టినా మద్దతు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది.