న్యూఢిల్లీ : వరుస ఎన్నికల్లో అంతంత మాత్రం ఫలితాలతో సతమవుతోన్న కాంగ్రెస్ పార్టీకి విపక్షాలు సైతం సహకరించడం లేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పౌరసత్వ సవరణ చట్టం (CAA), ఎన్ఆర్‌సీ అంశాలపై చర్చించేందుకు తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి గైర్హాజయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆఫ్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్‌కు ప్రస్తుతం మిత్రపక్షమైన శివసేన నేతలు సైతం విపక్షాల సమావేశానికి డుమ్మా కొట్టడం కాంగ్రెస్‌కు ప్రతికూలాంశంగా మారింది. ఎన్సీపీ, ఆర్జేడీ, వామపక్షాలు, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) మాత్రమే చర్చలో పాల్గొన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ బెంగాల్‌లో ట్రేడ్ యూనియన్  ధర్నా హింసాత్మకంగా మారిన కారణంగా తాను సీఏఏ, ఎన్ఆర్‌సీలపై చర్చించేందుకు విపక్షాలు నిర్వహిస్తోన్న సమావేశానికి హాజరుకాలేనని శుక్రవారమే మమతా బెనర్జీ స్పష్టంచేశారు. కాగా, సీఏఏ, ఎన్ఆర్‌సీ అంశాలపై మొదటగా పోరాటం మొదలుపెట్టింది తానేనని, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు చేసింది కేవలం విధ్వంసమేనని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా తాను విపక్షాలు చేపట్టిన చర్చా కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు వివరణ ఇచ్చుకున్నారు.


ఇకపోతే మాయావతి కాంగ్రెస్ పార్టీపై కోపంతో సమావేశానికి హాజరుకాలేదు. గతేడాది సెప్టెంబర్‌లో రాజస్థాన్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకుని వివాదానికి తెరతీసిందన్నారు మాయావతి. బీఎస్పీ కాంగ్రెస్‌కు మద్దతు తెలిపినా.. మా ఎమ్మెల్యేలను వాళ్ల పార్టీలో చేర్చుకోవడాన్ని తమ  నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. ఇప్పుడు తాను ఈ చర్చలో పాల్గొంటే రాజస్థాన్‌లో బీఎస్పీ నేతలకు మద్దతు ఉపసంహరించుకోవడమేనని పేర్కొన్నారు. రాజస్థాన్ కోటాలో చనిపోయిన శిశువుల తల్లులను ఓదార్చడానికి బదులుగా, సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా యూపీలో చేపట్టిన ర్యాలీలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొనడాన్ని సైతం యామావతి తీవ్రంగా తప్పుపట్టిన విషయం తెలిసిందే. 


Also Read: దమ్ముంటే చర్చకు రండి : రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలకు అమిత్ షా సవాల్


ఢిల్లీలో బీజేపీని ఎదుర్కొన్న ఆప్ పార్టీకి ఈ చర్చ కార్యక్రమంపై ఎలాంటి ఆహ్వానం అందలేదని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్ చెప్పారు. పిలవని పేరంటానికి వెళ్లడం మంచిదికాదని దూరంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇటీవల మహారాష్ట్రలో శివసేనకు కాంగ్రెస్ మద్దతు తెలిపి ప్రభుత్వ ఏర్పాటులో సాయం చేసింది. శివసేన నుంచి సంజయ్ రౌత్ ఈ చర్చలో పాల్గొంటారని ప్రచారం జరిగినా.. ఆయన కూడా పాల్గొనరని చివరిక్షణంలో తేలిపోయింది.


Also Read: సీఏఏ, ఎన్‌ఆర్‌సిల పట్ల బెంగాల్ ప్రజలు అసహనంతో ఉన్నారు: మోదీతో మమతా భేటీ


మతాల పరంగా విడదీస్తూ బీజేపీ ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శనివారం విమర్శించారు. సీఏఏ అనేది మత ప్రాతిపదికన తీసుకొస్తున్నారు కనుక కేంద్ర వెంటనే వెనక్కి తీసుకోవాలని, అదే విధంగా ఎన్ఆర్‌సీని నిలిపివేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది. మమతా బెనర్జీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సీఏఏ, ఎన్ఆర్‌సీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.


కాగా, పౌరసత్వ సవరణ చట్టం (CAA) ప్రకారం.. ముస్లిం మెజార్టీ ఉండే పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాల నుంచి భారత్‌కు 2014 డిసెంబర్ 31తేదీ వరకు వలసవచ్చిన హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, పార్శీలు, జైన శరణార్థులకు పౌరసత్వం లభిస్తుంది. అయితే సీఏఏ, జాతీయ పౌర రిజిస్ట్రేషన్ అనేవి ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంశాలని విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..