డిజిటల్ చెల్లింపులని ప్రోత్సహించి డిజిటల్ ఇండియాకు మరింత ఊతమిచ్చే ప్రయత్నంలో భాగంగా ఇకపై రూ.2,000 వరకు డెబిట్ కార్డు ద్వారా జరిపే డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్)ని రద్దు చేస్తున్నట్టు తాజాగా కేంద్రం స్పష్టంచేసింది. శుక్రవారంనాడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త ప్రకటన ప్రకారం ఇకపై రూ.2,000 వరకు విలువ చేసే వ్యాపార లావాదేవీలపై డెబిట్ కార్డు/భీమ్ యూపీఐ/ ఏఈపీఎస్ విధానం ద్వారా జరిపే చెల్లింపులపై బ్యాంకులు వ్యాపారస్తులపై విధించే ఎండీఆర్ చార్జీలని కేంద్రమే భరించనుంది.


జనవరి 1, 2018 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త విధానం రెండేళ్లపాటు అమలు జరగనుంది. ఈ రెండేళ్ల కాలంలో పైన పేర్కొన్న పద్ధతులలో జరిగే లావాదేవీలపై బ్యాంకులు విధించే చార్జీలని వ్యాపారస్తుల తరపున తిరిగి కేంద్రమే సంబంధిత బ్యాంకులకి రీఇంబర్స్ మెంట్ విధానం ద్వారా చెల్లించనున్నట్టు శుక్రవారం కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది. 


మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్):

డెబిట్ లేదా క్రెడిట్ కార్డు విధానం ద్వారా చెల్లింపులని స్వీకరించే వ్యాపారులపై పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ కానీ లేదా ఆన్ లైన్ ద్వారా కానీ సేవలు అందించే బ్యాంకులు విధించే సర్వీస్ చార్జీలనే మర్చంట్ డిస్కౌంట్ రేటు అని పిలుస్తారు.