Odisha Health Minister Dies: ఏఎస్‌ఐ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబ కిశోర్‌ దాస్ కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో  ఝార్సుగూడ జిల్లాలోని బ్రిజరాజ్‌నగర్ ప్రాంతంలో మంత్రిపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఓ కార్యక్రమం ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయన ఛాతీపై కాల్పులు జరిపాడు. వెంటనే ఆయనను ఝార్సుగూడ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అనంతరం భువనేశ్వర్‌లో తీసుకెళ్లగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోపాల్ దాస్ మంత్రిపై కాల్పులు జరిపారని పోలీసు అధికారి గుప్తేశ్వర్ భోయ్ తెలిపారు. ఈ దాడి అనంతరం స్థానికులు నిందితుడు ఏఎస్‌ఐని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు గోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాహనం దిగిన వెంటనే కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాడి వెనుక ఉద్దేశం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనను ఖండించిన ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌.. దర్యాప్తునకు క్రైమ్‌ బ్రాంచ్‌ను ఆదేశించారు. భువనేశ్వర్‌లోని నబ్ కిశోర్ దాస్‌ను చూసేందుకు ఆయన ఆసుపత్రికి వెళ్లారు.


మంత్రి నబా దాస్ మృతి పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం వ్యక్తం చేశారు. నబ కిశోర్ దాస్ దురదృష్టకర మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన మరణం ఒడిశా రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. ఈ కేసు దర్యాప్తును సీఐడీ క్రైమ్ బ్రాంచ్ చేపట్టింది. సైబర్ నిపుణులు, బాలిస్టిక్ నిపుణులు, క్రైమ్ బ్రాంచ్ అధికారులతో సహా ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందానికి డీఎస్పీ రమేష్ దొర నేతృత్వం వహిస్తున్నారు.


నిందితుడు గోపాల్ దాస్ సతీమణి జయంతి మాట్లాడుతూ.. తన భర్త మంత్రిపై కాల్పులు జరిపాడనే వార్తను న్యూస్ ఛానల్స్ ద్వారా విన్నానని చెప్పారు. దాస్ గత ఏడెనిమిదేళ్లుగా మానసికంగా కుంగిపోయి మందులు వాడుతున్నాడని చెప్పారు. ప్రస్తుతం పూర్తిగా మామూలుగా కనిపిస్తున్నాడని పేర్కొన్నారు. ఉదయం తమ కూతురికి తన భర్త వీడియో కాల్ చేశాడని చెప్పారు. మంత్రితో తన భర్త దాస్‌కు వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు.


మంత్రిపై దాడి ఘటనతో పాటు ఆయన మరణవార్త తెలియగానే పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. నబ దాస్ మద్దతుదారులు భద్రతా లోపాన్ని ప్రశ్నించారు. తమ నాయకుడిని టార్గెట్ చేసేందుకు కొందరు కుట్ర పన్నారని ఆరోపించారు.


నబ కిశోర్ దాస్ 2004లో ఒడిశాలోని ఝార్సాగూడ స్థానం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై తొలిసారి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో మళ్లీ కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. 2014లో కూడా కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నబ కిషోర్ దాస్ బిజూ జనతాదళ్‌లో కీలక నాయకుడిగా ఉన్నారు. మహారాష్ట్రలోని శని శింగణాపుర్‌ ఆలయానికి కోటి రూపాయలకుపైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు విరాళం ఇచ్చి ఆయన వార్తల్లో నిలిచారు.


Also Read: Nandamuri Tarakaratna: నా గుండె పగిలిపోయింది.. తారకరత్న ఆరోగ్యంపై నారా లోకేష్ ఎమోషనల్   


Also Read: Novak Djokovic: చరిత్ర సృష్టించిన నొవాక్ జోకోవిచ్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ ఫైనల్లో విక్టరీ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి