IRCTC 35 Paise Railway Travel Insurance: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు యావత్ దేశాన్ని కన్నీరు పెట్టిస్తోంది. ఇప్పటివరకు 278 మంది ప్రాణాలు కోల్పోగా.. వెయ్యికి మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాద స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రైలు ప్రమాదస్థలికి ప్రధాని వెళ్లనున్నారు. ప్రమాద ఘటన తీరును తెలుసుకోనున్నారు. కటక్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ ఘటనలో చనిపోయిన వారికి, గాయపడిన వారికి ప్రభుత్వం నుంచి.. రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఎంత సాయం అందుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసే సమయంలో 35 పైసలతో ఇన్సురెన్స్ సౌకర్యం ఉంటుంది. రైలు ప్రమాదంలో మరణించిన వారిని ఎంత డబ్బులు వస్తాయి..? గాయపడిన వారికి ఎంత అందుతుంది..? వివరాలు ఇలా..


రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం రూ.12 లక్షల పరిహారం అందజేయనుంది. మృతుల బంధువులకు రూ.10 లక్షల నష్టపరిహారం అందజేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించగా.. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి రూ.2 లక్షల పరిహారం కూడా అందజేస్తామని వెల్లడించింది. తీవ్రంగా గాయపడిన వారికి రైల్వే శాఖ నుంచి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందజేస్తారు. గాయపడిన వారందరికీ పీఎంఎన్ఆర్‌ఎఫ్‌ ద్వారా 50 వేల రూపాయల సహాయం అందించనున్నారు.


రైల్వే టిక్కెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసినప్పుడల్లా.. టిక్కెట్‌తో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కేవలం 35 పైసలు మాత్రమే వసూలు చేస్తారు. ఇప్పుడు ఒడిశా బాలాసోర్ రైల్వే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, క్షతగాత్రులకు ఈ ప్రయాణ బీమా వల్ల ప్రయోజనం చేకూరనుంది. టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు బీమా కంపెనీ నుంచి రూ.10 లక్షల పరిహారం అందుతుంది. ఈ ప్రయాణ బీమా రైలు ప్రమాదానికి సంబంధించి సెక్షన్ 123, 124, 124A కింద.. రైల్వే చట్టం 1989 ప్రకారం ఐఆర్‌సీటీసీ నిబంధనలు రూపొందించింది. 


రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారి బంధువులకు ప్రయాణికుడు మరణించిన తర్వాత రూ.10 లక్షల పరిహారం లభిస్తుంది. ప్రమాదంలో పూర్తిగా అంగవైకల్యం పొందిన ప్రయాణికుడికి కూడా రూ.10 లక్షల పరిహారం అందుతుంది. పాక్షిక శాశ్వత వైకల్యం ఏర్పడితే.. ప్రయాణికుడికి రూ.7.5 లక్షల పరిహారం అందుతుంది. మరోవైపు రైల్వే ప్రమాదంలో గాయపడితే ఆస్పత్రి ఖర్చుల పేరుతో రూ.2 లక్షల పరిహారం అందుతుంది.


Also Read: Odisha Tragedy: కొడుకు బతికున్నాడా లేడా, శవాల కుప్పలో వెతుకుతున్న ఓ తండ్రి


అయితే 35 పైసలతో తీసుకున్న ఇన్సురెన్స్ వర్తించాలంటే టికెట్‌ను కచ్చితంగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకుని ఉండాలి. అంటే ఈ-టికెట్లను బుక్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఒక పీఎన్‌ఆర్ నంబర్ నుంచి బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లకు ప్రయాణ బీమా తీసుకుంటే.. అన్ని టిక్కెట్లకు సమానంగా వర్తిస్తుంది. ఈ ప్రయాణ బీమా సౌకర్యం టికెట్ కన్ఫార్మ్ అయినవారికి, ఆర్‌ఏసీలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. జనరల్ టికెట్ తీసుకున్నా.. ఆఫ్‌లైన్‌లో కౌంటర్‌లో టికెట్‌ బుక్ చేసుకున్నా ఇన్సురెన్స్ సౌకర్యం లభించదు.


Also Read: Telangana Formation Day: ఇదో మైలురాయి.. నా జీవితం ధన్యమైంది: సీఎం కేసీఆర్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి