Odisha Accident Tragedy: ఒడిశా రైలు ప్రమాదం. తల్చుకుంటేనే ఒళ్లు జలదరించే ఘోరకలి. 288 మంది మరణించగా 1000 మంది గాయాలపాలై ఎక్కడెక్కడో చికిత్స పొందుతున్న వైనం. ఓ స్కూలు ఆవరణలో కుప్పలా పోసిన మృతదేహాల్లో కొడుకు ఉన్నాడా లేడా అని వెతుకులాడుతున్న ఓ తండ్రి దయనీయ పరిస్థితి..
ఒడిశా బాలాసోర్ సమీపంలోని బహనగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాద దృశ్యాలు కలచివేస్తున్నాయి. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఆగిన గూడ్స్ రైలును ఢీ కొని పట్టాలు తప్పి తీవ్రంగా ధ్వంసమైతే..పక్క ట్రాక్‌పై అటు నుంచి వస్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఆ భోగీల్ని కొట్టుకుంటూ వెళ్లి పట్టాల తప్పింది. వెరసి రెండు ప్యాసెంజర్ రైళ్లు ఘోర ప్రమాదంలో చిక్కుకున్న పరిస్థితి. ఇప్పటి వరకూ 288 మంది మరణించగా, 1000 మంది క్షతగాత్రులయ్యారు. ఒక్కొక్కరిని కదుపుతుంటే దయనీయ ఘటనలే విన్పిస్తున్నాయి. ఎవరు మరణించారో, ఎవరు బతికున్నారో తెలియని దయనీయ పరిస్థితి బాధిత కుటుంబాలది.
మృతదేహాల కుప్పలో కొడుకు కోసం వెతుకుతున్న ఓ తండ్రి
53 ఏళ్ల రబీంద్ర షావ్ పరిస్థితి ఇదే. కొడుకు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఇంటికొస్తున్నాడు. ఇంతలో రైలు ప్రమాదం గురించి తెలుసుకున్నాడు. కొడుకు జీవించి ఉన్నాడో, మరణించాడో తెలియదు. ఘటనా స్థలానికి వెళితే ఏమీ అర్ధం కాలేదు. అడిగితే సమీపంలోని స్కూల్‌లో కొన్ని మృతదేహాలు తరలించాం చూసుకోమన్నారు. అంతే ఇక్కడి కొచ్చి కుప్పలా పడున్న మృతదేహాల్లో కొడుకు ఉన్నాడో లేడో అని వెతుకులాడుతున్నాడు. ఈ మృతదేహాల్లో కొడుకు ఉండకూడదని మనసులో ప్రార్ధించుకుంటూనే అటూ ఇటూ వెతుకుతున్న దయనీయ పరిస్థితి మరే తండ్రికీ రాకూడదు. ఎక్కడో చోట క్షేమంగా గాయాలతోనైనా ఉండాలనే ఆశ మరోవైపు ఉండనే ఉంది. అయితే ఏదో తెలియని భయం వెంటాడుతోంది ఆ తండ్రికి.
బతికున్నప్పుడు చూడని 10 లక్షలొచ్చినందుకు ఆ మృతదేహాల్ని తట్టి లేపాలా
ఒడిశా రైలు ప్రమాదంలో మరణించినవారికి 10 లక్షలు, తీవ్ర గాయాలైనవారికి 2 లక్షల పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. బతికున్నప్పుడు 10 లక్షలు చూశారో లేదో మరణం ఆ 10 లక్షల్ని తెచ్చిపెడుతున్నందుకు ఏమనాలి. నీ కోసం 10 లక్షలు వచ్చాయని ఆ మృతదేహాల్ని తట్టి లేపాలా..ఈ పరిస్థితి ఈ ఒక్క తండ్రిదే కాదు..అక్కడున్న ప్రతి ఒక్కరిదీ. కొడుకు కోసం తండ్రి, తండ్రి కోసం కొడుకు భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, సోదరుడి కోసం సోదరి, సోదరి కోసం సోదరుడు ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కధ. మృతి చెందినవారికి అశ్రునయనాలతో ప్రగాఢ సానుభూతి.. కన్పించనివారు ఎక్కడో చోట ఏదో ఒక ఆసుపత్రిలో క్షేమంగా ఉండాలని ఆశిద్దాం..
Also read: Odisha Train Accident Update: ఘోరకలిలో 233కు చేరుకున్న మృతుల సంఖ్య, క్షతగాత్రులు వేయికి పైనే
దయనీయ దృశ్యాలు, కలచివేసే ఘటనలు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు గానీ అందరూ కలిసి ఒకేసారి కాటికి చేరుకున్నారు. మానవ తప్పిదం ఇంతటి ఘోరకలికి దారితీసిన పరిస్థితి. కుప్పలుగా పడి ఉన్న మృతదేహాలు..గాయాలతో కేకలు పెడుతున్న క్షతగాత్రులు. బతికి బట్టకట్టినందుకు ఆనందించాలా లేదా అవయవాలు కోల్పోయినందుకు బాధించాలో తెలియని దారుణ పరిస్థితి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook