నోట్ల రద్దు నిర్ణయంతో నల్లధనానికి చెక్?
నవంబరు, 2016.. భారతదేశ ఆర్థిక చరిత్రనే మార్చిన రోజు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అప్పటి వరకు చెలామణీలో ఉన్న 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నల్లధనాన్ని వెలికితీయడమే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. ప్రభుత్వం ప్రకటించినా, అదే నిర్ణయంపై ఆ తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులకు వచ్చిన ఫిర్యాదులు, చేసిన సెర్చ్‌లు, సీజ్ చేసిన ధనం మొదలైన వాటి గణాంకాలు కూడా వెలువడ్డాయి.
ఎప్పుడైతే భారత ప్రభుత్వం నోట్లరద్దు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందో.. ఆదాయపు పన్ను శాఖ చేసే సెర్చ్‌ల శాతం గణనీయంగా పెరిగింది. అప్పుటి వరకు ఉన్న 447 గ్రూపులు, 1152 గ్రూపులుగా ఎదిగి సెర్చ్‌లు సాగించాయి. అప్పటి తేదీకి 712 కోట్ల ధనాన్ని సీజ్ చేసిన శాఖ, ప్రకటన వెలువడ్డాక 1469 కోట్ల ధనాన్ని సీజ్ చేసింది. అలాగే నోట్లరద్దు జరిగే సమయానికి, అవినీతిపరుల వద్ద ఉన్న బహిర్గతం చేయని ఆదాయం కూడా 11,226 కోట్ల నుండి 15,496 కోట్ల రూపాయలకు పెరిగినట్లు అంచనా.
అలాగే నల్లధనాన్ని కనుగొనడానికి సాగించిన సర్వేల శాతం కూడా గణీయంగా పెరిగింది. అప్పటికి 4422 వరకు ఉన్న సర్వేల సంఖ్య, 12520కు పెరగడం గమనార్హం. అలాగే శాఖ గుర్తించిన బహిర్గతం చేయని ఆదాయపు విలువ కూడా 9654 కోట్ల నుండి 13920 కోట్లకు పెరిగింది.
ఆపరేషన్ క్లీన్ మనీ
- 31 జనవరి, 2017 తేదీన ఆదాయపు శాఖ "ఆపరేషన్ క్లీన్ మనీ" అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నోట్లరద్దు జరిగాక, ఎలాంటి బ్యాంకు అకౌంట్లలో ఎక్కువ మొత్తం డబ్బు డిపాజిట్ అవుతుందో.. అలాగే ఎలాంటి అకౌంట్లలో ఆదాయపు పన్ను రిటర్నులతో పాటు ఖాతాలో కనిపిస్తున్న ఆదాయానికి వ్యత్యాసం ఏర్పడుతుందో.. అలాంటి ఖాతాలపై నిఘా పెట్టడమే "ఆపరేషన్ క్లీన్ మనీ".
- ఆపరేషన్ క్లీన్‌మనీలో భాగంగా తొలివిడతలోనే 18 లక్షల అనుమానితుల్ని గుర్తించింది ప్రభుత్వం. ఖాతాలో చూపిస్తున్న డబ్బుకి, ట్రాన్సాక్షన్ జరుగుతున్న డబ్బుకి సంబంధం లేకపోవడం ఈ కేసుల్లో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆదాయం ఆర్జిస్తూ కూడా పన్ను చెల్లించని ఖాతాదారుల వల్లే ఈ సమస్య అని గుర్తించిన ప్రభుత్వం.. వెంటనే పన్ను చెల్లించాలని.. లేకపోతే ఖాతాలు స్తంబింపజేస్తామని తెలియజేసింది.
- అలాగే రెండవ విడతలో దాదాపు కోటి రూపాయల విలువైన 14000 ఆస్తులను గుర్తించింది ప్రభుత్వం. అవి ఇప్పటి వరకు ఆదాయపు పన్ను కూడా ఫైల్ చేయలేదని తెలుసుకొని, ఎంక్వయిరీకి ఆదేశించింది.
- రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న ఖాతాల కోసం, అలాంటి ఖాతాదారులపై నిఘా పెట్టడం కోసం ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్ కూడా ప్రభుత్వం ప్రారంభించింది.