న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలు జరిగే సమయంలో జమ్ముకాశ్మీర్‌లో పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాద సంస్థలు మరోసారి భారీ స్థాయిలో ఉగ్రదాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఇంటెలీజెన్స్ వర్గాలు భద్రతా బలగాలను హెచ్చరించాయి. లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల తరహాలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెన్సీ జమ్మూకాశ్మీర్‌లో మూడు బృందాలను ఏర్పాటు చేసిందని సమాచారం అందినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికలు జరిగే సమయంలో పోలింగ్ కేంద్రాలతోపాటు పోటీ చేసే అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిఘావర్గాలు సందేహం వ్యక్తంచేశాయి. అంతేకాకుండా జమ్ముకాశ్మీర్‌లోని తన బృందాలకు పేలుడు పదార్థాల ఉపయోగంతో శిక్షణ ఇచ్చేందుకు ఆప్ఘనిస్తాన్ నుంచి సుశిక్షితులైన ఉగ్రవాదులను రంగంలోకి దింపినట్టు నిఘవర్గాలు అనుమానాలు వ్యక్తంచేశాయి.


ఏప్రిల్ 11 నుంచి మే 6వ తేదీ వరకు మొత్తం మూడు దశల్లో జమ్ముకాశ్మీర్‌లో ఎన్నికలు జరగనుండగా మే 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన అనంతరం అక్కడ శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలకు కల్పిస్తున్న భద్రత సంబంధిత అంశాలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, ఎన్నికల సంఘం సమావేశమయ్యాయి. కాశ్మీర్‌కి అదనంగా మరో 800 పారా మిలిటరీ బలగాలను మొహరించేందుకు కేంద్ర హోంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.