ఆక్రమిత కాశ్మీరు పాకిస్తాన్ వాళ్లదే
నేషనల్ కాన్ఫరెన్సు నేత ఫరూఖ్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ అనేక సంవత్సరాలుగా ఆక్రమిత కాశ్మీరుగా పిలుచుకుంటున్న భాగం పాకిస్తాన్‌దేనని ఆయన తేల్చి చెప్పారు. "ఆ కాశ్మీరు భూభాగం మన సరిహద్దు దేశంలో ఉన్న పాకిస్తాన్‌లో ఉంది. ఇవతలి వైపు ఉన్నది భారత్‌లో ఉంది. భారత ప్రభుత్వానికి శాంతి ఒప్పందం చేసుకోవాలనే ఆలోచన ఉంటే.. పాకిస్తాన్‌తో మాట్లాడి ఇరువైపుల వారికి కూడా దానిపై అధికారం ఉండేలా ప్రయత్నించాలి" అని ఆయన అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వం నియమించిన మధ్యవర్తి దినేశ్వర శర్మ గురించి మీడియా అడిగినప్పుడు "నేను ఈ అంశంపై ఎక్కువగా వ్యాఖ్యానించను. ఆ వివాదం భారత్, పాకిస్తాన్ మధ్య ఉంది. దాని మీద ప్రభుత్వమే దగ్గరుండి మాట్లాడాలి" అని అన్నారు. ఫరూక్ అబ్దుల్లా గతంలో ఇవే వ్యాఖ్యలు చేశారు. ఆక్రమిత కాశ్మీరునే పీఓకే అనే పేరుతో కూడా పిలుస్తారు. అయితే పీఓకే జమ్ముకాశ్మీర్‌లో అంతర్భాగమని ప్రధాని నరేంద్రమోదీ పదవి చేపట్టాక స్పష్టంచేశారు.