కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు దిగుతున్న పాకిస్తాన్‌కి చెందిన ఐఎస్ఐ తాజాగా నేపాల్‌లో ఓ కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేసుకుంది. అక్కడి నుంచే కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేలా కంట్రోల్ రూమ్‌ని తీర్చిదిద్దుకుంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దు రేఖ వెంబడి భారత్ భద్రతను కట్టుదిట్టం చేయడంతో ఇక చేసేదేం లేక నేపాల్ ద్వారా భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు ఐఎస్ఐ కుట్రపన్నుతోంది. నిఘా వర్గాలకు అందిన సమాచారం ప్రకారం.. గత కొన్ని నెలలుగా ఉగ్రవాద సంస్థలకు చెందిన నేతలు, కమాండర్లు ఐఎస్ఐ ఏజెంట్లతో భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది.  


నిఘావర్గాలు జీ న్యూస్‌కి వెల్లడించిన సమాచారం ప్రకారం మార్చి, ఏప్రిల్ నెలల్లో ఐఎస్ఐ నిర్వహించిన ఓ సమావేశానికి హాజరైన ఇద్దరు ఉగ్రవాదులు అక్కడ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులతో భేటీ అయినట్టు తెలుస్తోంది. అక్కడ మరో ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో పరిచయం ఏర్పర్చుకున్న ఉగ్రవాదులు.. అక్కడి నుంచి ఐదుగురు కలిసి జమ్ముకశ్మీర్ చేరుకున్నారని నిఘావర్గాలకు సమాచారం అందింది.