దాదాపు నెల రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 11 నుంచి వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. మంగళవారం రాత్రి కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు బాధవారం ఓ అధికారిక ప్రకటన వెలువడింది. ఆసక్తికరమైన మరో అంశం ఏంటంటే.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న డిసెంబర్ 11వ తేదీనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు సైతం వెలువడనున్నాయి. 


సాధారణంగా ప్రతీ ఏడాది నవంబర్‌లోనే శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతుంటాయి. అయితే, ఈ తరహాలో డిసెంబర్‌లో శీతాకాల సమావేశాలు ప్రారంభం అవడం ఇది రెండోసారి. 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలోనే ఈసారి సమావేశాలు ఆలస్యంగా ప్రారంభం అవుతున్నట్టు తెలుస్తోంది.