గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ఆదివారం డిశ్చార్జ్‌ అయ్యారు. పారికర్ ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో ఆస్పత్రి నుంచి ఆయన్ను డిశ్చార్జ్‌ చేసినట్లు ఎయిమ్స్‌ అధికారులు తెలిపారు. నేటి సాయంత్రం పారికర్‌ ప్రత్యేక విమానంలో గోవాకు వెళ్లనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొంతకాలంగా పాన్‌క్రియాటిక్ సమస్యతో బాధపడుతున్న పారికర్‌ చికిత్స నిమిత్తం సెప్టెంబరులో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. అంతకుముందు కూడా అమెరికా, ముంబయి హాస్పిటల్స్‌లో చేరి ట్రీట్మెంట్ తీసుకున్నారు.


పారికర్ ఎయిమ్స్ నుంచే గోవా పాలనావ్యవహారాలను చూసుకున్నారు. ఇటీవలే కేబినెట్ మంత్రులతో ఆస్పత్రిలో భేటీ అయ్యాక.. పారికర్ తన వద్ద ఉన్న కొన్ని మంత్రిత్వశాఖలను ఇతరులకు కేటాయించనున్నట్లు.. త్వరలోనే శాఖల మార్పులు కూడా ఉంటుందని చెప్పారని తెలుస్తోంది.


ఇదిలా ఉండగా.. అనారోగ్య సమస్యలతో విధులకు దూరంగా ఉంటున్న పారికర్‌పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో పాలనావ్యవస్థ కుంటుపడిందని ఆరోపిస్తున్నాయి.