అయోధ్య రామాలయానికి రూ.10 కోట్ల భారీ విరాళం
శతాబ్దాలుగా కొనసాగుతున్న రామ మందిరం, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు అనంతరం ఆలయ నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. రామాలయ నిర్మాణం తేదీపై నిర్ణయం తీసుకునేందుకు ఈ 19న ఆలయ నిర్మాణ ట్రస్ట్ సమావేశం కానుంది.
పాట్నా: రామ జన్మభూమి అయోధ్య ఆలయం - బాబ్రీ మసీదు వివాదాన్ని సుప్రీంకోర్టు గతేడాది పరిష్కరించింది. దీంతో రామ మందిర నిర్మాణం త్వరలో చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటన సైతం చేయడం తెలిసిందే. ఈ క్రమంలో రామాలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. సోమవారం రికార్డు స్థాయిలో రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు. బిహార్‌లోని పాట్నాకు చెందిన మహవీర్ ఆలయ పాలక మండలి రామ మందిర నిర్మాణానికి రూ.10కోట్లు అందజేయనున్నామని ప్రకటించింది. ప్రస్తుతానికి తొలుత రూ.2 కోట్లకు చెక్కు రూపంలో అందజేయనున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి కిశోర్ కునాల్ రామ మందిర నిర్మాణ ట్రస్టుకు ఆ చెక్ అందజేస్తారని మహవీర్ ఆలయ ట్రస్ట్ తెలిపింది.
ఈ విషయంపై కిశోర్ మాట్లాడుతూ.. ‘ఆయోధ్య రామ మందిరం నిర్మాణానికి విరాళాలు అందించాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా తొలుత రూ.2 కోట్లను చెక్కు రూపంలో అయోధ్య ఆలయానికి అందజేయనున్నాం. దశలవారీగా మిగతా రూ.8కోట్లను చెల్లిస్తామని’ చెప్పారు. చెక్కు అందజేసే ముందు జిల్లా మేజిస్ట్రేట్ అనుజ్ ఝా అనుమతి తీసుకున్నట్లు వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన సమయంలోనే మహవీర్ ఆలయ పాలకమంలి కార్యదర్శి ఈ విరాళాన్ని ప్రకటించగా.. ఇందులో భాగంగా కొంత మేర ఆలయ నిర్మాణం కోసం తాజాగా అందజేశారు. కాగా, రామాలయ నిర్మాణం తేదీపై నిర్ణయం తీసుకునేందుకు ఫిబ్రవరి 19న ఆలయ నిర్మాణ ట్రస్ట్ సమావేశం కానుంది.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టీ కామేశ్వర్ చౌపల్ జీ మీడియాతో మాట్లాడారు. 2022కల్లా రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామాలయానికి పునాదిరాయి వేస్తారని చెప్పారు. నవంబర్ 2019లో వివాదాస్పద స్థలం అయోధ్య ఆలయానికి చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పువెలువరించింది. మూడు నెలల్లోగా రామాలయ నిర్మాణంపై పూర్తి ప్రతిపాదన, వివరాలు సిద్ధం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. రామాలయ నిర్మాణానికి 67 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.