పోటీతో సంబంధం లేకుండా కుమారస్వామికి మోదీ శుభాకాంక్షలు
మీ హయాంలో పరిపాలన సజావుగా సాగాలని కోరుకుంటున్నా : ప్రధాని నరేంద్ర మోదీ
కర్ణాటకకు 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జేడీఎస్ అధినేత కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ నేత, పీసీసీ అధ్యక్షుడు డా. పరమేశ్వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి హయాంలో పరిపాలన సజావుగా సాగాలని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆ ఇద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ బుధవారం ఉదయమే మోదీ ఓ ట్వీట్ చేశారు. కర్ణాటకలో 104 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరరించిన బీజేపీ ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని శతవిధాలా ప్రయత్నించింది. గవర్నర్ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప బలపరీక్షలో వెనక్కు తగ్గడంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి వదులుకోకతప్పలేదనే సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న 78 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జేడీఎస్ పార్టీ. ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేసిన కుమారస్వామి వచ్చే వారం ఏర్పాటు చేయనున్న కేబినెట్‌లో సింహభాగం కాంగ్రెస్‌కి ప్రాధాన్యత ఇవ్వక తప్పడం లేదని తెలుస్తోంది. కుమారస్వామి నేతృత్వంలో ఏర్పాటు కానున్న కేబినెట్‌లో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వుండనుండగా మరో 12 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు వుండనున్నారని సమాచారం.