PM Modi meets CM Mamata Banerjee: కోల్‌కతాలో ప్రధాని మోదీ, సీఎం మమతా బెనర్జీల భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం కొద్దిసేపటి క్రితమే కోల్‌కతా చేరుకున్నారు. మరోవైపు ఇటీవల కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC), వామపక్ష పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు కేంద్రంపై తీవ్ర నిరసనలు చేపడుతున్నాయి.
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం కొద్దిసేపటి క్రితమే కోల్‌కతా చేరుకున్నారు. కోల్‌కతా విమానాశ్రయంలో ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్, నగర మేయర్, మంత్రి ఫర్హద్ హకీం ఎదురెళ్లి స్వాగతం పలికారు. మరోవైపు ఇటీవల కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC), వామపక్ష పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు కేంద్రంపై తీవ్ర నిరసనలు చేపడుతున్న సమయంలో ప్రధాని మోదీ కోల్‌కతాలో పర్యటిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాని మోదీ ఈ పర్యటనలో భాగంగానే కోల్‌కతా పోర్ట్ ట్రస్టు 150వ వర్షికోత్సవ వేడుకల్లో పాల్గొననుండటంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోనున్నారు. కోల్‌కతా చేరుకున్న ప్రధాని మోదీతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టంపై పోరాటం చేస్తున్న వారిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ముందుంటున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, సీఎం మమతా బెనర్జీల సమావేశం సైతం ఆసక్తిని రేకెత్తిస్తోంది.