ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన పురస్కారం లభించింది. 'యూఎన్ఈపీ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్' అవార్డును ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్‌ ప్రధాని నరేంద్రమోదీకి బహుకరించారు. న్యూఢిల్లీలోని ప్రవాస భారతీయ కేంద్రంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రంమలోనే ప్రధానికి ఐరాస సెక్రెటరీ జనరల్ అవార్డును అందజేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కార్యక్రమంలో గుటెర్రస్‌ మాట్లాడుతూ.. 'పర్యావరణ మార్పుల వల్ల కలిగే ముప్పును మోదీ గుర్తించారు. ఒక విపత్తును నివారించడానికి ఏమి చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఇతర నాయకులు కూడా దీనిని గుర్తించగలరు, తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు.కానీ ఇతరులకు, మోదీకి వ్యత్యాసం ఉంది. అదేమిటంటే.. మోదీ విపత్తును గుర్తించడమే కాక దాని నివారణపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తారు' అని అన్నారు.



ఇది ఐక్యరాజ్యసమితి ఇచ్చే అత్యున్నత పర్యావరణ పురస్కారం. ఈ అవార్డును ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్‌లకు సంయక్తంగా ప్రకటించారు. ఫ్రాన్స్‌, భారత్‌లు అంతర్జాతీయ సౌర ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో మోదీ, మాక్రోన్‌‌లకు ఈ అవార్డు వరించింది.


న్యూయార్క్‌లో సెప్టెంబర్ 26న ఐక్యరాజ్యసమితి 73వ సర్వసభ్య సమావేశాలు జరుగుతున్న సమయంలో జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) లో ఈ అవార్డును ప్రకటించారు.


అవార్డు స్వీకరణ అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'ఇది భారతీయులకు దక్కిన గౌరవం. భారతీయులు పర్యావరణాన్ని కాపాడటానికి కట్టుబడి ఉన్నారు.' అని అన్నారు. 'పర్యావరణం, విపత్తు.. రెండింటికీ సంస్కృతితో సంబంధం ఉన్నాయి. పర్యావరణం గురించి మన సంస్కృతి ఆలోచించకుంటే, విపత్తులను నివారించలేము. 'సబ్ కా సాత్' నినాదంలోనే ప్రకృతి కూడా ఉంది'  అని ప్రధాని తెలిపారు.