దక్షిణాదిలో ఇక బీజేపీ గెలవడం కల్ల: ప్రకాష్ రాజ్
కర్నాటక ఎన్నికల సందర్భంగా జోరుగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన ఆలోచనలను పంచుకున్నారు. కర్ణాటకలోనే కాదు.. యావత్ దక్షిణ భారతదేశంలోనే బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అని ఆయన తెలిపారు.
కర్నాటక ఎన్నికల సందర్భంగా జోరుగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన ఆలోచనలను పంచుకున్నారు. కర్ణాటకలోనే కాదు.. యావత్ దక్షిణ భారతదేశంలోనే బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు.
"అయ్యా.. మోదీ గారు..! మీరు పార్టీనేతలను నోరు అదుపులో పెట్టుకోవాలని అంటున్నారు. కానీ దయచేసి వారిని మాట్లాడనివ్వండి. మీరు వారి నోళ్లు మూయించాలని చూసినా.. వారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ముందు మీరు వర్గ రాజకీయాలు చేయడం లేదని నిరూపణ చేయండి. నేను ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధం. అలాగే ప్రజలు కూడా రాజకీయ నాయకులు చెప్పే మాటలు నమ్మకూడదు. హామీలు నెరవేర్చేవారి మాటలు మాత్రమే నమ్మాలి" అన్నారు
అలాగే కర్ణాటక రాజకీయాలపై కూడా ప్రకాష్ రాజ్ స్పందించారు. బీజేపీ పార్టీకి కర్ణాటక ప్రజలు పట్టం కట్టే అవకాశం లేదన్నారు. ముఖ్యంగా యడ్యూరప్ప మీద వస్తున్న అవినీతి ఆరోపణలు ఆ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో ఈ నెల 12వ తేదిన ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు మే 15వ తేదిన వెలువడనున్నాయి.
ఇప్పటికే ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు హోరాహోరిగా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. మోదీయే స్వయంగా బరిలోకి దిగి తమ పార్టీకి ప్రధాన ప్రచారకర్తగా మారారు.