ప్రియాంక గాంధీ ప్రయాణించిన ద్విచక్ర వాహనానికి జరిమానా
ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకగాంధీ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనానికి హెల్మెట్ లేని కారణంగా ఉత్తరప్రదేశ్ లోని లక్నో పోలీసులు జరిమానా విధించారు. హెల్మెట్ ధరించకుండా, ప్రమాదకరంగా ద్విచక్రవాహనంపై వెళ్లారంటూ ఆమెతో పాటు మరో కాంగ్రెస్ నేత మాతాజీ ఎమ్మెల్యే ధీరజ్ గుర్జార్ కు రూ. 6,100 జరిమానా విధించారు.
న్యూ ఢిల్లీ : ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకగాంధీ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనానికి హెల్మెట్ లేని కారణంగా ఉత్తరప్రదేశ్ లోని లక్నో పోలీసులు జరిమానా విధించారు. హెల్మెట్ ధరించకుండా, ప్రమాదకరంగా ద్విచక్రవాహనంపై వెళ్లారంటూ ఆమెతో పాటు మరో కాంగ్రెస్ నేత మాతాజీ ఎమ్మెల్యే ధీరజ్ గుర్జార్ కు రూ. 6,100 జరిమానా విధించారు. దీనికి సంబంధించిన చలానాలను వాహన యజమాని రాజ్ దీప్ సింగ్ కు పంపారు.
పౌరసత్వ సవరణ చట్టం 2019 బిల్లుకు వ్యతిరేక నిరసనల్లో అరెస్టైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ దారాపురి కుటుంబాన్ని పరామర్శించేందుకు గత శనివారం ఆమె లక్నో వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తమను ఎందుకు అడ్డుకున్నారని పోలీసులతో ప్రియాంక వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసుల కళ్లుగప్పి ప్రియాంక, ధీరజ్ ఇద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్లారు. అయితే, హెల్మెట్ లేకుండానే వారు ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీటి ఆధారంగా ట్రాఫిక్ ఎస్పీ వారికి జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు రూ. 2,500, ఇద్దరూ హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు గాను రూ. 500, ట్రాఫిక్ నిబంధనలు పాటించనందుకు రూ. 300, తప్పుడు నంబర్ ప్లేట్ ఉన్నందుకు రూ. 300, నిర్లక్ష్యంగా నడిపినందుకు రూ. 2,500... ఇలా మొత్తం రూ. 6,100 ఫైన్ వేశారని లక్నో ట్రాఫిక్ పోలీసు వర్గాలు తెలిపాయి.