కాలుష్యానికి కారణమవుతున్న స్టెర్‌లైట్ ఇండస్ట్రీస్‌ని మూసేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ తమిళనాడులోని తూతుక్కుడి వద్ద ఆందోళనకారులు చేపట్టిన నిరసన హింసకు దారితీసింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది.తూతుక్కుడిలోని వేదాంత స్టెర్‌లైట్ కాపర్ పరిశ్రమను మూసేయాల్సిందిగా గత నెలరోజులుగా జరుగుతున్న ఆందోళన అనుకోకుండా మంగళవారం హింసాత్మకంగా మారింది. మద్రాస్ హై కోర్టు ఆదేశాల మేరకు పరిశ్రమకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు ఆందోళనకారులను పరిశ్రమ వైపు రాకుండా అడ్డుకున్నారు. ఇదే క్రమంలో ఆందోళనకారులు పోలీసులను హెచ్చరికలను లెక్క చేయకుండా పరిశ్రమ వైపు దూసుకొచ్చారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

ఇదే నేపథ్యంలో అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు సైతం ప్రతిగా బాష్పవాయువు ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కితగ్గకపోవడంతో లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణలో 9 మంది మృతి చెందారు. ఆందోళనకారులు దాదాపు 50 వరకు వాహనాలకు నిప్పుపెట్టారు.