Pune fire incident death toll: పూణెలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరుకుంది. సోమవారం రాత్రి వరకు ఫ్యాక్టరీలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు, అగ్నిమాపక దళాలు పరిశ్రమలోంచి 18 మృత దేహాలు వెలికితీశారు. చనిపోయిన వారిలో మహిళలే 15 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. చీకటి పడటంతో పాటు అగ్ని ప్రమాదంతో పరిశ్రమ పరిసరాలు వేడెక్కిన కారణంగా సెర్స్ ఆపరేషన్స్ నిలిపేశారు. మంగళవారం ఉదయం నుంచి పరిశ్రమలో సెర్స్ ఆపరేషన్  తిరిగి ప్రారంభించనున్నట్టు అక్కడి అధికారవర్గాలు తెలిపాయి. పూణె శివార్లలోని ముల్షి తహశిల్ పరిధిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఎస్వీఎస్ ఆక్వా టెక్నాలజీస్‌లో (SVS Aqua Technologies) ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్వీఎస్ ఆక్వా టెక్నాలజీస్‌లో క్లోరైన్ డయాక్సైడ్ (chlorine dioxide) తో పాటు ఇతర కెమికల్స్ తయారు చేస్తున్నట్టు పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేనంతగా అగ్నికి ఆహుతయ్యాయి. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు ముల్షి డివిజన్ సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్ సందేష్ షిర్కె తెలిపారు. పూణె అగ్ని ప్రమాదం నుంచి గాయాలతో బయటపడిన వ్యక్తిని కూడా చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రికి తరలించినట్టు సందేష్ చెప్పారు.


పూణె అగ్ని ప్రమాదం గురించి పూణె మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (PMRDA) చీఫ్ ఫైర్ ఆఫీసర్ దేవేంద్ర మాట్లాడుతూ.. ''కంపెనీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ప్యాకింగ్ సెక్షన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, అక్కడ చుట్టూ ప్లాస్టిక్ ఉండటంతో మంటలు (Pune fire tragedy) క్షణాల్లోనే కంపెనీ మొత్తానికి వ్యాపించాయి'' అని అన్నారు.