కోహ్లీ ఛాలెంజ్ లాగే నా ఛాలెంజ్ కూడా స్వీకరించండి: ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ ఛాలెంజ్
ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ ఛాలెంజ్
టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ స్వీకరిస్తున్నట్టు చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనదైన స్టైల్లో స్పందించారు. ఫిట్‌నెస్ వ్యాప్తి లక్ష్యంగా విరాట్ కోహ్లీ చేసిన ఛాలెంజ్‌ని స్వీకరించడం బాగానే వుంది కానీ నేను మీకు చేస్తోన్న ఈ ఛాలెంజ్‌ను కూడా అదేవిధంగా స్వీకరించండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ ఓ ఛాలెంజ్ చేశారు. " పెరుగుతున్న ఇంధనం ధరలను ప్రభుత్వం తగ్గించాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధంగా వుంది " అని రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. తాను చేసిన ఛాలెంజ్‌కి ప్రధాని మోదీ స్పందిస్తారని ఆశిస్తున్నట్టు రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఫిట్‌నెస్ లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మొదలుపెట్టిన ఫిట్‌నెస్ వీడియో ఛాలెంజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన టాపిక్ అయింది. తాను పుష్‌అప్స్ చేస్తోన్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్.. తన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని స్వీకరిస్తూ మీరు కూడా మీ ఫిట్‌నెస్ వీడియోను షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతూ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, స్టార్ షట్లర్ సైనా నేహ్వాల్‌లని నామినేట్ చేశారు.
రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ చేసిన ఛాలెంజ్‌ని స్వీకరించిన విరాట్ కోహ్లీ.. తన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని స్వీకరించాల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటి, తన భార్య అయిన అనుష్క, టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీలను నామినేట్ చేశాడు. కోహ్లీ ఛాలెంజ్‌ని స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ.. "త్వరలోనే తన ఫిట్‌నెట్ వీడియోను షేర్ చేసుకుంటాను" అని బదులిచ్చిన సంగతి తెలిసిందే.