కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటకలో లింగాయత్ లని ఓ ప్రత్యేక మతంగా గుర్తించి ఆ బిల్లుని ఆమోదించిన కర్ణాటక ప్రభుత్వం ఆ తర్వాత అదే బిల్లుని కేంద్రం వద్దకు పంపిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కర్ణాటకలో ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీని ఓ మహిళ కాస్తంత గట్టిగానే నిలదీసింది. మీరు (కాంగ్రెస్ పార్టీ) లింగాయత్ లని కూడా ప్రత్యేక మతంగా గుర్తించి భారతీయులని మతం పేరిట విడదీసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని అడిగింది ఆ మహిళ. అయితే, మహిళ అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని రాహుల్ గాంధీ ఒక్కసారిగా తెల్లమొహం వేశారు. ఆ అంశం గురించి తనకు అంత అవగాహన లేదు.. మీకు సీఎం సిద్ధరామయ్య గారు సమాధానం చెబుతారు అంటూ రాహుల్ గాంధీ తన పక్కనే వున్న సిద్ధరామయ్య వైపు తిరిగారు. దీంతో తన ప్రశ్నకు రాహుల్ గాంధీ నుంచి ఏదో ఓ స్పష్టమైన సమాధానం వస్తుందని ఆశించిన ఆ మహిళ సహా.. అక్కడున్న వాళ్లంతా ఆ సమాధానం విని నిర్ఘాంతపోయారు. రాహుల్ గాంధీ ఇచ్చిన సమాధానం విని వెంటనే తేరుకున్న సిద్ధరామయ్య.. తాము కేవలం లింగాయత్ ల డిమాండ్ ని మాత్రమే కేంద్రానికి పంపించామని తెలిపారు. 


కర్ణాటకలో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనియాంశమైంది. సంచలనం సృష్టించిన ఇంత పెద్ద వివాదంపై, అది కూడా తమ పార్టీ నేతలు తీసుకున్న నిర్ణయంపై అధినేతకే అవగాహన లేకపోతే ఎలా అని అక్కడున్న జనం చెవులు కొరుక్కోవడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.