నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రెన్స్ టెస్ట్-నీట్ 2018 అభ్యర్థుల డేటా లీకయ్యాయని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు లీక్ కావడంపై ఆయన సీరియస్ అయ్యారు. 2018నీట్ వ్యవహారంఫై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సీబీఎస్ఈ చీఫ్ అనితా అగర్వాల్‌కు లేఖ రాశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘‘ఈ ఏడాది నీట్ రాసిన అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు కొన్ని వెబ్‌సైట్లలో అమ్మకానికి పెట్టినట్టు, దాదాపు 2 లక్షల మందికి పైగా అభ్యర్థుల డేటా చోరీ అయినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా అభ్యర్థుల గోప్యత విషయంలో రాజీపడుతూ.. ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థుల డేటా లీకవ్వడం పట్ల నేను దిగ్భ్రాంతికి గురయ్యాను.’’ అని రాహుల్ లేఖలో తెలిపారు. డేటా లీక్‌ను అడ్డుకోవడంలో భద్రతా ప్రమాణాలను పాటించలేదని అర్థమవుతోందని.. సీబీఎస్ఈ చిత్తశుద్ధిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టి.. అందుకు బాధ్యలైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీబీఎస్ఈ చీఫ్‌కి రాసిన లేఖలో రాహుల్ కోరారు.



 


ఈ ఏడాది మేలో జరిగిన నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరి కోసం 2,225 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కొరకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష నీట్. ఈ పరీక్షను సీబీఎస్ఈ ఏటా నిర్వహిస్తుంది.