మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘననివాళి
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్‌ను గుర్తుచేసుకున్నారు.
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్‌ను గుర్తుచేసుకున్నారు. ఇతరుల పట్ల ఎలా ఉండాలో నేర్పినందుకు తండ్రికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
అంతకుముందు కుటుంబసభ్యులు, పలువురు నేతలు న్యూఢిల్లీలోని వీర్ భూమి వద్ద రాజీవ్ కు ఘనంగా నివాళులర్పించారు. సోమవారం ఉదయం సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాజీవ్ కూతురు ప్రియాంక వాద్రా ఆమె భర్త రాబర్ట్ వాద్రా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజీవ్ సేవల్ని వారు స్మరించుకున్నారు. టెక్నాలజీ(ఐటీ) రంగాన్ని అభివృద్ధి పరచడంతో పాటు ప్రజాస్వామ్య దేశానికి పంచాయతీ రాజ్ సంస్థల అవసరం ఉందని గ్రహించిన ప్రధాని రాజీవ్ అని అన్నారు.
1944 ఆగస్ట్ 20న జన్మించిన రాజీవ్ గాంధీ 1984-1989 మధ్య కాలంలో భారత ప్రధానిగా సేవలందించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజీవ్ గాంధీని 1991 మే 21న తమిళనాడులోని పెరంబదూర్‌లో ఎల్టీటీఈకి చెందిన ఆత్మాహుతి దళం హత్య గావించింది. కాగా ఇటీవల రాహుల్ గాంధీ సింగపూర్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘నా తండ్రిని హత్య చేసిన వారికి క్షమిస్తున్నాను. నా సోదరి ప్రియాంక వారిని ఎప్పుడో క్షమించేసింది. ప్రజలను ద్వేషించడం మాకు చాలా కష్టం’ అన్నారు.