రాజీవ్ హంతకులను విడిచిపెట్టం: కేంద్రం స్పష్టీకరణ
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదలచేసే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు స్ఫష్టం చేసింది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదలచేసే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించి ఏడుగురిని విడుదల చేయాలన్న విజ్ఞప్తిని తిరస్కరించినట్లు కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ప్రజాస్వామ్య దేశంలో రాజీవ్ గాంధీని హత్య చేయడం దారుణమని, ఈ కేసులో నిందితులకు శిక్ష విధించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.
రాజీవ్ గాంధీని తమిళనాడు చెన్నై సమీపంలో గల శ్రీపెరంబదూర్‌లో ఎల్.టి.టి.ఇకి చెందిన ఆత్మాహుతి దళం మే 21, 1991న హత్య గావించింది. ఈ ఘటనలో సుమారు 14 మంది చనిపోయారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి థాను. థాను రాజీవ్ గాంధీ కాళ్ళకు నమస్కారం చేయటానికి వంగి తన నడుముకు ఉన్న ఆర్‌డీఎక్స్ ప్రయోగించింది. ఆ విధంగా రాజీవ్ గాంధీ హత్య చేయబడ్డారు.
కాగా ఈ హత్య కేసులో నలుగురికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు 1999మేలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. అయితే ఏప్రిల్ 2000లో తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు, సోనియా గాంధీ అప్పీళ్లు చేయడంతో ప్రధాన ముద్దాయి నళినికి విధించిన మరణశిక్షను రద్దుచేశారు.
ఫిబ్రవరి 18, 2014న సుప్రీంకోర్టు ఉరిశిక్ష పడ్డ మిగితా ముగ్గురి శిక్షలను జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పు వెలువరించింది. కాగా రాజీవ్ హంతుకులను విడుదల చేయాలని భావిస్తున్నట్లు 2016లో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేనిది వారిని విడుదల చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.
రాజీవ్ గాంధీ భారతదేశ 6వ ప్రధానమంత్రి. గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందిన వ్యక్తుల్లో ప్రధాని పదవి చేపట్టిన మూడవ వ్యక్తి. 1984లో తల్లి ఇందిరాగాంధీ హత్యకు గురైన తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టారు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ.. భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.